Share News

బాలాజీ రైల్వే డివిజన్‌కోసం ముందడుగు

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:51 PM

జిల్లాలో 1990లో పురుడు పోసుకున్న బాలాజీ రైల్వే డివిజన్‌ నేటికీ కార్యరూపం దాల్చలేదు.

బాలాజీ రైల్వే డివిజన్‌కోసం ముందడుగు
సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు

తిరుపతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1990లో పురుడు పోసుకున్న బాలాజీ రైల్వే డివిజన్‌ నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీని సాధన కోసం తిరుపతిలోని రాజకీయ, ప్రజా సంఘాలు ఏకమయ్యాయి. ఉద్యమం ద్వారానైనా సాధించేందుకు ముందడుగు వేశాయి. ఇందులో భాగంగా ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో బాలాజీ రైల్వే డివిజన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. రైల్వే డివిజన్‌ సాధనకోసం చేసిన ప్రయత్నాలు, వచ్చినట్టే వచ్చి గుంటూరుకు వెళ్లిపోవడం, డివిజన్‌ రావడంలో ప్రయోజనాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమితి కన్వీనర్‌ కుప్పాల గిరిధర్‌ వివరించారు. ‘బాలాజీ డివిజన్‌ రాకపోవడానికి రాజకీయ పరిణామాలే కారణం. ప్రాంతీయ అసమానతలను పురికొల్పేలా కాకుండా రాయలసీమకు న్యాయం చేయాలి. 35 ఏళ్ల కలను సాకారం చేసుకునే దిశగా బాలాజీ రైల్వే డివిజన్‌ సాధన సమితి పోరాటం సాగిస్తుంది. తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్‌ ఏర్పాటు మా హక్కు అన్న ‘సీమ’ ప్రజల నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌ ద్వారా డిమాండును తెలియజేద్దాం’ అని గిరిధర్‌ తెలిపారు. డివిజన్‌ ఏర్పాటుకు వనరుల ఇబ్బంది లేదని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు తెలిపారు. గుంతకల్లు డివిజన్లోని పాత ఇనుము అమ్మితే రూ.20 వేల కోట్లు వస్తుందని, అమరరాజ ఫ్యాక్టరీ అవతల స్థలమూ ఉందన్నారు. తిరుపతికి వచ్చే ప్రయాణికులకు సదుపాయాలు, పర్యాటకంగా మరింత అభివృద్ధి రైల్వే డివిజన్‌తోనే సాధ్యమవుతుందని యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌ అన్నారు. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో రైల్వే డివిజన్‌ కీలక పాత్ర పోషిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. బాలాజీ రైల్వే డివిజన్‌ కావాలన్న ప్రజల బలమైన ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ తెలిపారు. ఈ ఉద్యమానికి ఎంపీల సహకారం తీసుకోవాలని బీజేపీ నేత నవీన్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలతో బాలాజీ డివిజన్‌ డిమాండ్‌ను లేవనెత్తిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కందారపు మురళి చెప్పారు. అంతకుముందు రైల్వే స్టేషన్‌ నుంచి ఆటో, జీప్‌ యూనియన్‌ నాయకులు, డ్రైవర్లు ‘మనందరి విజన్‌- రైల్వే డివిజన్‌’ బ్యానర్‌ పట్టుకుని నినాదాలతో ర్యాలీగా కచ్చపి ఆడిటోరియానికి వచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ మాజీ డిప్యూటీ ఏవో చిన్నంగారి రమణ, సామాజికవేత్త పీసీ రాయల్‌, బీఎంఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆకుల సతీష్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.చౌదరి, న్యాయవాది దినకర్‌, శ్రీకాళహస్తి బోర్డు మాజీ సభ్యుడు మహీధర రెడ్డి, పోస్టల్‌ యూనియన్‌ నాయకులు శ్రీధర్‌ బాబు, ఫిల్మ్‌సొసైటీ చైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి, టీడీపీ నేత ఆముదాల తులసీరాం, ఐటీ నిపుణులు, పోస్టల్‌, ఆర్టీసీ, ఉపాధ్యాయ, విద్యార్థి, మర్చంట్‌ అసోసియేషన్ల నాయకులు, ఎస్వీయూ ప్రొఫెసర్లు, క్రెడాయ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:51 PM