తొలిరోజు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:27 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది. పక్కా ప్రణాళికలు అమలుచేసిన నేపథ్యంలో తొలిరోజు మంగళవారం వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా ముగిశాయి. ధనుర్మాస, నిత్య కైంకర్యాల అనంతరం మంగళవారం వేకువజాము 1.20 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను మొదలుపెట్టారు.
స్వర్ణరథంలో దర్శనమిచ్చిన మలయప్ప
సాయంత్రం తర్వాత పెరిగిన భక్తుల రద్దీ
నేడు పుష్కరిణిలో చక్రస్నానం
తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది. పక్కా ప్రణాళికలు అమలుచేసిన నేపథ్యంలో తొలిరోజు మంగళవారం వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా ముగిశాయి. ధనుర్మాస, నిత్య కైంకర్యాల అనంతరం మంగళవారం వేకువజాము 1.20 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను మొదలుపెట్టారు. 7.15 గంటల వరకు నిరంతరాయంగా సుప్రీం, ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులకు దర్శనం చేయించారు. ఆ తర్వాత డిప్ ద్వారా టోకెన్లు పొందిన సర్వదర్శన భక్తులను అనుమతించారు. అప్పటి నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు స్లాట్ల వారీగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేశారు. సోమవారం కనిపించిన పలుచటి భక్తుల సంఖ్యతో ఈసారి రద్దీ చాలా తక్కువగా ఉందని అందరూ భావించారు. అయితే మంగళవారం మధ్యాహ్నం తర్వాత తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరగడంతో సాయంత్రం నుంచి తిరుమలలో రద్దీ కనిపిచింది.
వీఐపీలకు ఆరు గంటలు
సాధారణంగా ఏకాదశి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రకటించిన సమయాని కంటే ముందుగానే ముగించి వీలైనంత త్వరగా సాఽధారణ దర్శనాలను మొదలుపెడతారు. ఈసారి 5.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగిస్తామని టీటీడీ ప్రకటించినా.. 7.15 గంటల వరకు కొనసాగించింది. దీంతో దాదాపు 6 గంటల సమయం వీఐపీల దర్శనానికే పట్టింది. అంటే అదనంగా రెండు గంటల దర్శన సమయం వీఐపీల ఖాతాలో పడింది.
సాఫీగా క్యూలైన్ల కదలికలు
టైం స్లాట్ టోకెన్లు కేటాయించడంతో పాటు భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. ఈసారి మూడు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. దీంతో చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా తొలిరోజు దర్శనం ముగిసింది. మరోవైపు సోమవారం 11 గంటల సమయానికే ఏకాంత సేవ నిర్వహించినా.. అప్పటి వరకు 59,631 మందికి దర్శనం చేయించగలిగారు.
స్వర్ణరథంలో ఉత్సవమూర్తుల దర్శనం
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వర్ణరథంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. బంగారు రథాన్ని మహిళలు గోవిందనామస్మరణతో లాగారు. తూర్పు, ఉత్తర మాడవీధి మలుపులో భక్తులు భారీ సంఖ్యలో కనిపించారు.
మొదటి ఘాట్‌లో వాహనాల రద్దీ
మంగళవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకున్న వీఐపీలందరూ వెనువెంటనే తిరుగు ప్రయాణమైన క్రమంలో తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటిఘాట్‌లో రద్దీ నెలకొంది. ఉదయం 11 గంటల వరకు వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు సాగాయి. మధ్యాహ్నం తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంది.
2వ తేదిపై దృష్టి
తొలిరోజు దర్శనం ప్రశాంతంగా ముగియడంతో టీటీడీ బోర్డుతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలో జరిగిన తొక్కిసలాటతో ఈసారి వైకుంఠద్వార దర్శనాలు టీటీడీకి పెద్ద సవాలుగా మారింది. పైకి టీటీడీ చాలా సాధారణంగానే కనిపించినా గతం మాత్రం భయపెడుతూనే వచ్చింది. వ్యూహాత్మక ప్రణాళికతో తొలిరోజు దర్శనాలు సాఫీగా ముగియడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2వ తేదీ నుంచి టోకెన్లు, టికెట్లు లేకపోయినా ఎవరైనా దర్శనానికి రావచ్చని టీటీడీ ప్రకటన చేసింది. ఈక్రమంలో 2వ తేదీన రద్దీ అధికంగా ఉండవచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. అలాగే 3, 4 తేదీలు వారాంతాలు, పైగా నూతన ఏడాది మొదటి వారం రద్దీ పెరగచ్చనే యోచనలో ఉన్నారు. దీంతో 2వ తేదీపై టీటీడీ దృష్టి పెట్టింది.