ముప్పతిప్పలు పెడుతున్న ఒంటరి ఏనుగు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:28 AM
ఓ ఏనుగు రామకుప్పం మండలంలో వారం రోజులుగా సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది
రామకుప్పం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జంటను వీడిన ఓ ఏనుగు రామకుప్పం మండలంలో వారం రోజులుగా సంచరిస్తూ అటవీ శాఖ అధికారులను, ట్రాకర్లను ముప్పతిప్పలు పెడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం రాత్రి కూడా ఆ ఏనుగు ననియాల సమీప పొలాల్లో సంచరించి ఇద్దరు రైతులకు చెందిన వరిపైరును తిన్నంతగా తిని, పాక్షికంగా ధ్వంసం చేసింది. ట్రాకర్లు బాణసంచా పేల్చి అడవిలోకి మళ్ళించారు. సోమవారం సాయంత్రం 5.30గంటలకే ననియాల కౌండిన్య ఎలిఫెంట్ క్యాంపు వైపు వచ్చిన ఆ ఏనుగు క్యాంపు సరిహద్దులోని సోలార్ విద్యుత్ కంచె వద్దే 20నిమిషాల పాటు అటూఇటూ తిరిగింది. ఇంతలో అటవీశాఖ అధికారులు దానికి ఎదురుగా క్యాంపులోని కుంకీ ఏనుగు జయంత్‌ను తీసుకెళ్ళి నిలబెట్టగా వెనుదిరిగింది. తిరిగి గంట తర్వాత మళ్లీ అక్కడకు రాగా అటవీశాఖ అధికారులు, ట్రాకర్లు టపాకాయలు పేల్చుతూ అడవిలోకి తరిమేశారు. అటవీ విభాగాధికారి హరికుమార్ అధ్వర్యంలో ననియాల, ననియాలతండ గ్రామాల్లో ఏనుగుల కదలికలపై ప్రజలకు అవగాహన కల్పించారు.చీకటి పడిన తర్వాత పొలాల వద్దకు వెళ్ళరాదని, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు చీకటి పడక ముందే ఇళ్ళకు చేరుకోవాలని సూచించారు.ఏనుగులకు తగిలేంత ఎత్తులో విద్యుత్ తీగలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని కోరారు. ఎవరూ ఏనుగులను తరిమే ప్రయత్నాలు చేయరాదన్నారు. తాము ట్రాకర్లతో కలిసి ఏనుగుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. జంట ఏనుగులు విడిపోయి ఒకటి ననియాల, మరోటి నారాయణపురంతండా ప్రాంతాల్లో ఉన్నాయని, రైతులు వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయరాదన్నారు.ఏనుగుల కదలికలపై ఏదైనా సమాచారం అందితే వెంటనే 8919668651, 6301667521 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
కొనసాగుతున్న గజ దాడులు
సోమల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):సోమల మండలంలోని ఆవులపల్ల్లె పంచాయతీ రాంపల్లెబీట్ అటవీ శివారు పొలాల్లో ఆదివారం రాత్రి ఏనుగులు సంచరించి మామిడి, కొబ్బరి తోటల్లో పంటలను ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. వరి, టమెటా పంటలను తొక్కి నష్టపరచడంతో పాటు డ్రిప్ పరికరాలను, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయంటూ ఆవులపల్లె సచివాలయంలో సోమవారం వినతులు అందజేశారు.