Share News

ప్రాణం తీసిన విహార యాత్ర

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:40 AM

ఆదివారం సెలవు. సరదాగా గడుపుదామని ఆ ముగ్గురు మిత్రులు బైకుపై విహార యాత్రకు బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో యల్లంపాటి భవానిప్రసాద్‌(22), ముడూరు గణేష్‌(17) మృతిచెందగా, బట్టా అనిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దొరవారిసత్రం మండలం అక్కరపాక పెట్రోల్‌ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ముగ్గురిది నాయుడుపేట మండలం పుదూరు గ్రామం. భవానిప్రసాద్‌ చెన్నైలోని దానిష్‌ అహ్మద్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో సీఈసీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. అదే కాలేజీలో గణేష్‌ బీటెక్‌ ఫస్టియర్‌లో చేరాడు. సెలవు కావడంతో సరదాగా వరదయ్యపాళెం మండలం ఉబ్బలమడుగు వెళదామనుకున్నారు.

ప్రాణం తీసిన విహార యాత్ర
భవానిప్రసాద్‌ (ఫైల్‌ ఫొటో)

  • ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొన్న బైకు

  • ఇద్దరు యువకుల దుర్మరణం

  • మరొకరికి తీవ్రగాయాలు

దొరవారసత్రం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఆదివారం సెలవు. సరదాగా గడుపుదామని ఆ ముగ్గురు మిత్రులు బైకుపై విహార యాత్రకు బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో యల్లంపాటి భవానిప్రసాద్‌(22), ముడూరు గణేష్‌(17) మృతిచెందగా, బట్టా అనిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దొరవారిసత్రం మండలం అక్కరపాక పెట్రోల్‌ బంకు ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ముగ్గురిది నాయుడుపేట మండలం పుదూరు గ్రామం. భవానిప్రసాద్‌ చెన్నైలోని దానిష్‌ అహ్మద్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో సీఈసీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. అదే కాలేజీలో గణేష్‌ బీటెక్‌ ఫస్టియర్‌లో చేరాడు. సెలవు కావడంతో సరదాగా వరదయ్యపాళెం మండలం ఉబ్బలమడుగు వెళదామనుకున్నారు. మరో స్నేహితుడు అనిల్‌తో కలిసి స్పోర్ట్స్‌ బైక్‌లో బయలుదేరారు. అతి వేగంగా వెళుతున్న వీరు అక్కరపాక పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి ముందు వెళుతున్న కంటైనర్‌ లారీని ఢీకొన్నారు. రోడ్డుపై పడిపోవడంతో తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే హైవే పోలీసుల సాయంతో 108 ద్వారా ముగ్గురినీ సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భవానిప్రసాద్‌, గణేష్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలు విరిగి తీవ్రంగా గాయపడిన అనిల్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఘటనా స్థలం పరిశీలించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులది ఒకే గ్రామం కావడంతో.. వారంతా సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనతో ఆస్పత్రి ప్రాంగణం విషాదంగా మారింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Updated Date - Aug 04 , 2025 | 01:40 AM