కిలో ఎండు కొబ్బరి రూ.200
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:40 AM
రెండు నెలలుగా కొబ్బరి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండు కొబ్బరి కిలో రూ.200 నుంచి రూ.240 వరకు పలుకుతోంది.
పాలసముద్రం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రెండు నెలలుగా కొబ్బరి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండు కొబ్బరి కిలో రూ.200 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. గత ఏడాది ఎండు కొబ్బరి కిలో రూ.100 వరకు మాత్రమే పలికింది. పాలసముద్రం మండలంలో సుమారు 3,000 ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. ప్రస్తుతం వంద పచ్చి కొబ్బరికాయలు రూ.2000 నుంచి రూ.2,200 వరకు పలుకుతున్నాయి. కొబ్బరి తోటలకు ఏరిఫైడ్ నల్లి సోకడంతో దిగుబడి తగ్గి పోయింది. కేరళ, తమిళనాడులో అయితే ఏరిఫైడ్‌తోపాటు నల్లిరోగం సోకడం వల్ల దిగుబడి తగ్గి పోయిందని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గినా ధర పెరగడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండుకు తగినట్లు ఉత్పత్తి లేకపోవడం వల్ల వ్యాపారులే రైతుల వద్దకొచ్చి కొబ్బరి కాయలు, ఎండు కొబ్బరిని కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు.