Share News

ఏనుగుల మంద స్వైరవిహారం

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:22 AM

రామకుప్పం మండలంలోని 89పెద్దూరు గ్రామ సమీప తోటలపై సోమవారం రాత్రి ఆరు ఏనుగుల మంద స్వైరవిహారం చేసింది. తమిళనాడు అడవుల నుంచి వి.కోట మండలం నాయకనేరి అడవుల మీదుగా వచ్చిన ఏనుగులు 89పెద్దూరు గ్రామానికి చెందిన పలువురి అరటి, టమోటా, మామిడి తోటలపై దాడులు చేసి.. విధ్వంసం సృషించాయి.

ఏనుగుల మంద స్వైరవిహారం
అడవిలోకి వెళ్తున్న ఏనుగులు

రామకుప్పం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలోని 89పెద్దూరు గ్రామ సమీప తోటలపై సోమవారం రాత్రి ఆరు ఏనుగుల మంద స్వైరవిహారం చేసింది. తమిళనాడు అడవుల నుంచి వి.కోట మండలం నాయకనేరి అడవుల మీదుగా వచ్చిన ఏనుగులు 89పెద్దూరు గ్రామానికి చెందిన పలువురి అరటి, టమోటా, మామిడి తోటలపై దాడులు చేసి.. విధ్వంసం సృషించాయి. ఓ రైతుకు చెందిన 30 అరటిచెట్లను ధ్వంసం చేశాయి. మరో రైతు టమోటా తోటను కొంతమేర ధ్వంసం చేశాయి. సమీప మామిడి తోటల్లో సంచరిస్తూ మామిడికాయలు, పండ్లను తిన్నంతగా తిని.. నేలరాల్చాయి. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు, ట్రాకర్లతో కలిసి పెద్దూరు అటవీ ప్రాంతానికి చేరుకుని డప్పులు వాయిస్తూ, టపాకాయలు పేల్చుతూ ఏనుగుల మందను అడవిలోకి తరిమేశారు. ఇప్పటికే 15 రోజులుగా ననియాల గ్రామ పరిసర పొలాలు, తోటలపై ఒంటరి ఏనుగు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడీ ఏనుగుల మంద కూడా తోడవడంతో అటవీ సమీప గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులను పొలాలు, గ్రామాల వైపు రాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 01:22 AM