Share News

త్రిసభ్య కమిటీల్లో చోటుపై ఆశల చిగురింత

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:53 AM

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆలంబనగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్‌ విండోల)కు త్రిసభ్య కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

త్రిసభ్య కమిటీల్లో చోటుపై ఆశల చిగురింత

సింగిల్‌ విండోల పదవులపై ద్వితీయశ్రేణి నాయకుల నిరీక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆలంబనగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్‌ విండోల)కు త్రిసభ్య కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.ప్రస్తుతం పర్సన్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారుల పదవీకాలం గత సోమవారంతో ముగియగా, ఈ నెల 31వరకు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో త్రిసభ్య కమిటీల్లో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న ద్వితీయశ్రేణి నాయకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 75 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. జిల్లాలవారీగా చిత్తూరులో 37, తిరుపతిలో 23, అన్నమయ్యలో 15 సింగిల్‌ విండోలున్నాయి. వీటిలో ప్రస్తుతం పర్సన్‌ ఇన్‌చార్జులుగా ఇటీవల బదిలీపై వచ్చిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లను, బ్రాంచ్‌ మేనేజర్లను, సర్కిల్‌ సూపర్వైజర్లను, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించారు.వీరి పదవీకాలాన్ని ఈ నెలాఖరు దాకా ప్రభుత్వం పొడిగించింది.వీరి స్థానాల్లో త్రిసభ్య కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కమిటీలో చైర్మన్‌తో పాటు ముగ్గురిని డైరక్టర్లుగా నియమించేందుకు మూడునెలల క్రితమే ఆశావహుల పేర్లను తీసుకున్నారు.

ఎమ్మెల్యేలే జాబితాలను సిద్ధం చేసి టీడీపీ అధిష్ఠానానికి పంపించారు. కొన్నిచోట్ల కూటమి నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వాటిని పక్కన పెట్టేశారు.అయితే జూలై 15లోగా సంఘాలన్నిటికీ త్రిసభ్య కమిటీలు వేయనున్నట్లు సమాచారం. తర్వాత ఎన్నికలు నిర్వహించినా అప్పుడు కూడా వీరినే అధ్యక్షులుగా కొనసాగించేలా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీడీపీ అధిష్ఠానం జిల్లా నేతలకు సూచించినట్లు తెలిసింది. తేడాలుంటే ఇప్పుడే సరిదిద్ది, మరోసారి జాబితాను పునఃపరిశీలించాలని చెప్పడంతో ఆ మేరకు వడపోత కూడా జరిగింది.75 సింగిల్‌ విండోలకు నియమించే త్రిసభ్య కమిటీల సభ్యులకు చెందిన 19 అంశాలతో కూడిన సమాచారాన్ని సహకారశాఖ సేకరిస్తోంది. సభ్యులకు సొసైటీలో సభ్యత్వం ఉందా?, రుణాలు, వ్యవసాయ భూములున్నాయా? వారిపై ఏదైనా కేసులున్నాయా? వంటి 19 అంశాలతో కూడిన వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా జరుగుతుండగానే త్రిసభ్య కమిటీలకు ప్రతిపాదించిన సభ్యుల పేర్లు బయటకు వెల్లడి కావడంతో ఇక వారే నియమితులవుతారంటూ గ్రామాల్లో ప్రచారాలు ప్రారంభమయ్యాయి.చాలాచోట్ల వారికి పదవులొచ్చేశాయంటూ సన్మానాలు చేయడం కూడా ప్రారంభించారు.

Updated Date - Jul 05 , 2025 | 09:41 AM