Share News

భారతీయ విజ్ఞాన వైభవాన్ని చాటిన సమ్మేళనం

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:22 AM

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ దేశ ప్రాచీన, ఆధునిక విజ్ఞాన వైభవాన్ని చాటింది. సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని మూడు వేర్వేరు వేదికల నుంచీ భారత దేశ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతికలతో సమ్మిళితం చేయాల్సిన అవసరాన్ని సదస్సు నొక్కి చొప్పింది.

భారతీయ విజ్ఞాన వైభవాన్ని చాటిన సమ్మేళనం
సమావేశంలో ప్రసంగిస్తున్న మోహన్‌ భగవత్‌

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ దేశ ప్రాచీన, ఆధునిక విజ్ఞాన వైభవాన్ని చాటింది. సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని మూడు వేర్వేరు వేదికల నుంచీ భారత దేశ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతికలతో సమ్మిళితం చేయాల్సిన అవసరాన్ని సదస్సు నొక్కి చొప్పింది. ప్రతి చర్చలోనూ అభివృద్ధి అంతిమ లక్ష్యం సమాజ హితంగా ఉండాలన్న సందేశం అంతర్లీనంగా ప్రతిఫలించింది. ఆ దిశగా ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన ప్రసంగం ప్రతినిధులకు స్ఫూర్తిని కలిగించింది. దార్శనికత కలిగిన పాలకుడిగా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు ఉపన్యాసం సైతం ఆహూతులను ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి శాస్త్ర సాంకేతిక నిపుణులతో పాటు ప్రాచీన శాస్త్రాలకు సంబంధించిన అధ్యాపకులు సదస్సుకు తరలి వచ్చారు. మరోవైపు దేశంలోని ఐఐటీలు, ఐఐఎ్‌సఈఆర్‌లు మొదలుకుని జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల నుంచీ, పరిశోధనా సంస్థల నుంచీ పరిశోధక విద్యార్థులు, సాధారణ విద్యార్థులు హాజరయ్యారు. 1500 మంది తమదైన రంగాల్లో ప్రతిభావంతులైన ప్రతినిధుల రాకతో సంస్కృత వర్సిటీ ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది. డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ సతీ్‌షరెడ్డి వంటి అత్యున్నత స్థాయి శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులను కలుసుకునేందుకు, వారితో కలసి ఫొటోలు దిగేందుకు ప్రతినిధులు ఆసక్తి చూపారు. శాస్త్రీయ, జానపద, ఆదివాసీ సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఓవైపు ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, మరోవైపు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేందర్‌ సింగ్‌, ఇంకోవైపు జాతీయ భద్రతా సలహాదారు, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ జి.సతీ్‌షరెడ్డి వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు పాల్గొనడంతో సంస్కృత వర్శిటీకి వెళ్ళే దారులు, వర్శిటీ ప్రాంగణం సాయుధ బలగాలమయంగా మారింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే క్యాంప్‌సలోకి ప్రతినిధులను అనుమతించారు. మీడియా ప్రతినిధులనూ పరిమితంగానే పంపారు. మొత్తానికీ నాలుగు రోజుల సమ్మేళనం తొలిరోజు అట్టహాసంగానే జరిగింది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

ప్రపంచమంతా ఇండియావైపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో

భిన్నంగా ఆలోచించండి

జ్ఞానం, విజ్ఞానం మన దేశానికి కొత్త కాదు. 4500 ఏళ్లకు ముందే హరప్పా, మెహంజదారో నాగరికతలు, అప్పట్లోనే అర్బన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ పాటవాలు ప్రపంచానికి చాటి చెప్పాయి. 2900 ఏళ్ల కిందటే మనం యోగ విద్యను ఆచరించాం. అప్పుడే ఆయుర్వేద వైద్యసేవలు అందించాం. శాస్త్రవేత్తలూ, మీరంతా కొత్తగా.. భిన్నంగా ఆలోచించండి. ఆత్మన్యూనత వదిలిపెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టండి.

- సీఎం చంద్రబాబు

అందరూ బాగుండటమే..

ప్రతి వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఈ దిశగా విజ్ఞాన భారతి బాధ్యత తీసుకుని అధ్యాపకులతో, శాస్త్ర పరిశోధకులతో మంచి శాస్త్ర సాంకేతిక అంశాలపై సదస్సులు, చర్చా గోష్ఠులు నిర్వహిస్తోంది. మనతో పాటు అందరూ బాగుండేలా చేయడమే నిజమైన అభివృద్ధి.

- మోహన్‌ భగవత్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌

త్వరలో సూపర్‌ పవర్‌గా భారత్‌

రెండేళ్ల కిందటి వరకూ అంతరిక్ష రంగంలో భారత్‌ ఒకింత వెనుకబడి ఉండేది. ఇప్పుడు మన దేశ అంతరిక్ష ప్రయోగాలు, వ్యాపారాల విలువ 8 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు. వంద దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం. 3.8 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల వైద్య పరికరాలను ఎగుమతి చేయగలుగుతున్నాం. భారతీయ విజ్ఞాన సమ్మేళనం ద్వారా భారత్‌ త్వరలో సూపర్‌ పవర్‌గా మారాలి.

- జితేందర్‌ సింగ్‌, కేంద్ర మంత్రి

స్థానిక భాషల్లో మన విజ్ఞానం

భారతీయ విజ్ఞాన గ్రంథాలను స్థానిక భాషల్లో ప్రచురిస్తాం. మాతృభాషలో అయితే సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రాల్లోని అంశాలను స్వదేశీ భావనతో స్వీకరించి దేశాభివృద్ధికి కృషి చేయాలి.

- శేఖర్‌ మాండే, విజ్ఞాన భారతి చైర్మన్‌

ప్రాచీన, ఆధునిక విజ్ఞానాలకు సమ ప్రాధాన్యం

మన దేశ ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో సమంగా ప్రాధాన్యం ఇవ్వాలి. రక్షణ, అంతరిక్ష పరిశోధనలకు, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇస్తోంది.

- సతీష్‌ రెడ్డి, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌

Updated Date - Dec 27 , 2025 | 01:22 AM