Share News

ఒంటరి మహిళలను బురిడీ కొట్టించే దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:51 AM

ఒంటరి మహిళలను బురిడీ కొట్టించే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి టూటౌన్‌ సీఐ నాగార్జునరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ జిల్లా కుబేర్‌నగర్‌కు చెందిన గుజరాతి కిషన్‌(24) కొన్నేళ్లుగా తెలంగాణలోని మేడ్చల్‌ దొమ్మయిగూడలో ఉంటూ కూలీ పనులు చేసుకునేవాడు.

ఒంటరి మహిళలను బురిడీ కొట్టించే దొంగల ముఠా అరెస్టు
Arrest

శ్రీకాళహస్తి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఒంటరి మహిళలను బురిడీ కొట్టించే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి టూటౌన్‌ సీఐ నాగార్జునరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ జిల్లా కుబేర్‌నగర్‌కు చెందిన గుజరాతి కిషన్‌(24) కొన్నేళ్లుగా తెలంగాణలోని మేడ్చల్‌ దొమ్మయిగూడలో ఉంటూ కూలీ పనులు చేసుకునేవాడు. ఢిల్లీలోని సుల్తానపూర్‌కు చెందిన శ్యామ్‌లాల్‌ (30) అదే ఊరిలో ప్లాస్టిక్‌ పూల తయారీలో పని చేసేవాడు. వీరిద్దరికి మేడ్చల్‌కి చెందిన ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి ఒంటరి మహిళలను బురిడీ కొట్టించేవారు. ముందుగా బాలుడిని పంపి మహిళలతో మాటలు కలుపుతారు. ఆ తర్వాత ఈ ఇద్దరు వెళ్లి ఆ బాలుడు తమ యజమాని నుంచి పెద్దమొత్తంలో బంగారం, డబ్బు తీసుకొచ్చాడని నమ్మిస్తారు. డబ్బుకు ఆశ పడిన వారిని గుర్తించి తమ వద్ద ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తామని బదులుగా కొంత బంగారు ఇస్తే చాలని నమ్మిస్తారు.

ముందుగా పైనా కింద డబ్బు పెట్టి లోపల తెల్లకాగితాలతో అచ్చం డబ్బులు కట్టలా మొత్తం నగదులా సిద్ధం చేసుకున్న రెండుకట్టలను ఇచ్చి బంగారు ఆభరణాలతో మాయమవుతారు. అదే తరహాలో తమ వద్ద బంగారం ఉందని తక్కువ ధరకు ఇస్తామనీ మోసగిస్తారు. ఈ ముఠాపై తెలంగాణలో ఏడు కేసులు నమోదై.. రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. అలాగే శ్రీకాళహస్తితో పాటు చిత్తూరు, కడప జిల్లాలో మరో రెండు కేసులున్నాయి. శ్రీకాళహస్తిలో ఘటనకు సంబంధించి నిందితుల కోసం సీఐ గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో బాలుడితో పాటు సంచరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి 114 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లువెల్లడించారు. ఈ కేసులో ప్రతిభచూపిన కానిస్టేబుళ్లు నందకుమార్‌, సుబ్రహ్మణ్యం, క్రాంతికుమార్‌, రేగన్‌, నరేష్‌, సుధాకర్‌, అరుణ్‌కుమార్‌, బాబును అభినందించారు.

Updated Date - Jul 05 , 2025 | 09:09 AM