Share News

మామిడి కాయల టోకెన్ల కోసం తోపులాట

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:32 AM

గుడిపాల మండలంలోని ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం టోకెన్ల కోసం మామిడి రైతులు తోపులాడుకున్నారు.

మామిడి కాయల టోకెన్ల కోసం తోపులాట
టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న మామిడి రైతులు

గుడిపాల, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గుడిపాల మండలంలోని ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం టోకెన్ల కోసం మామిడి రైతులు తోపులాడుకున్నారు.రోజుకు 50నుంచి 80దాకా మాత్రమే టోకెన్లు ఇస్తుండగా వాటికోసం వస్తున్న మామిడి రైతుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ఫ్యాక్టరీ యజమానులు రైతులకు ఎటూ చెప్పలేక గమ్మునుండి పోయారు. ఫ్యాక్టరీలో పల్ప్‌ తయారీలో సాంకేతిక లోపం వలన సకాలంలో మామిడి కాయలు అన్‌లోడ్‌ చేయక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోపక్క టోకెన్ల కోసం వందలాదిమంది ఫ్యాక్టరీ వద్ద గుమికూడారు.టోకెన్లను జారీ చేయాలని ఫ్యాక్టరీ సిబ్బందిని పట్టుబట్టారు.ఫ్యాక్టరీ మేనేజర్‌ చంద్రశేఖర్‌,సూపర్‌వైజర్‌ రమే్‌ష సిబ్బందితో కలసి టోకెన్లు జారీ చేస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది.దీంతో డీఎస్పీ సాయినాథ్‌, ఎస్‌ఐ రామ్మోహన్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని రైతులతో చర్చించి జూలై 5వ తేది వరకు సుమారు 1200 టోకెన్లను పంపిణీ చేయించారు. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా సీకేపల్లె వద్ద ఉన్న తాజా మ్యాంగో ఫ్యాక్టరీలో కాయల అన్‌లోడింగుకు ఎమ్మెల్యే పేరును వైసీపీ వారు వాడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హేమాద్రినాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఆరోపించారు.ఎమ్మెల్యే జగన్‌ రైతుల మనిషి అని, ఆయన ఎవరికీ సిఫార్సు చేసే వ్యక్తి కాదంటూ ఫ్యాక్టరీ యజమానులతో వాగ్వాదానికి దిగి నిజమైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 18 , 2025 | 01:32 AM