తొలగని ‘చెత్త’తలనొప్పి
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:12 AM
తిరుమల కొండపై చెత్త సమస్య సమసిపోలేదు. మళ్లీ వ్యర్థాలు గుట్టల్లా పోగవుతున్నాయి. కొండలా పేరుకుపోతున్న ఇక్కడి చెత్త తొలగింపుపై గతేడాది టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది.
డంపింగ్ యార్డులో పెరుగుతున్న వ్యర్థాలు
కాలపరిమితి ముగియడంతో వెనుదిరిగిన కాంట్రాక్టర్లు
ఫలించని టీటీడీ ‘ఉచిత’ నిర్వహణ యత్నం
తిరుమల, జూన్28(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై చెత్త సమస్య సమసిపోలేదు. మళ్లీ వ్యర్థాలు గుట్టల్లా పోగవుతున్నాయి. కొండలా పేరుకుపోతున్న ఇక్కడి చెత్త తొలగింపుపై గతేడాది టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది. కొండ మీద రోజూ తడిచెత్త దాదాపు 30 టన్నులు, పొడిచెత్త 40 టన్నుల వరకు సేకరించి గోగర్భం డ్యాం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద డంప్‌యార్డ్‌కు తరలిస్తున్నారు. అక్కడ తడిచెత్తను ప్రొసెస్ చేశాక కంపోస్టు తయారు చేసి మిగిలిన వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీ లేదా పవర్‌ప్రాజెక్ట్‌ల ప్రాంతాలకు పంపాలి. కానీ ఐదారేళ్లుగా ఈ ప్రక్రియ సరైన రీతిలో జరగలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తడి, పొడిచెత్తలను వేరు చేసి తరలించడంలోనే విఫలమాయ్యారు. దీంతో కంపోస్టు కేంద్రంలో నిర్వహణ సరిగా జరగలేదు. ఫలితంగా కొండలను తలపించేలా వ్యర్థాలు చేరిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గతేడాది నవంబరులో ఈ సమస్య పరిష్కరించాలని సంకల్పించింది. అప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలున్నట్టు గుర్తించారు. ఆరు నెలల్లోపు క్లియర్ చేస్తామని ప్రకటించారు.
వెనుతిరిగిన కాంట్రాక్టు సంస్థలు
కొన్ని నెలల పాటు ఓ సంస్థ దాదాపు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను ప్రాసెస్ చేసి తొలగించింది. సవ్యంగా జరుగుతోందనుకునే లోపే సంస్థ కాంట్రాక్టు పూర్తయింది. కాంట్రాక్టును పొడిగించాలని ఆ సంస్థ కోరింది. టీటీడీ అంగీకరించలేదు. ఉచితంగా చేయాలని కోరింది. దీంతో ఆ సంస్థ వెళ్లిపోయినట్టు సమాచారం. తడిచెత్తను ప్రాసెస్ చేసే సంస్థ కాంట్రాక్టు కూడా ఈ ఏడాది మార్చికే పూర్తయింది. యంత్రాల మరమ్మతులు, కార్మిక సమస్యతో సరిగా నిర్వహించలేదంటూ ఆ సంస్థకు కూడా అనుమతికి నిరాకరించింది. పొడి వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మరో సంస్థకు ఎనిమిదేళ్ల పాటు అగ్రిమెంట్ ఉంది. ఈ సంస్థ కూడా సమర్థమంతంగా నిర్వహించడంలేదని టీటీడీ భావించింది. యంత్రాలతో చేయాలనే నిబంధన లేకపోవడంతో మాన్యువల్‌గానే ప్రాసెస్ చేస్తున్న క్రమంలో పొడిచెత్త ఎంతకూ తరగడం లేదు. దీంతో డంపింగ్ యార్డులో లెగసీ వ్యర్థాలు 50 వేల మెట్రిక్ టన్నులు, తడి వ్యర్థాలు 31,500 మెట్రిక్ టన్నులు, పొడి వ్యర్థాలు 4,800 మెట్రిక్ టన్న్థులు పేరుకుపోయాయి. తిరుమల పర్యావరణానికే ఈ వ్యర్థాల ద్వారా నష్టం వాటిల్లే అవకాశముందనే భయంతో టీటీడీ ఇటీవల రాజే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ సంస్థను సలహాదారుగా నియమించింది. ఈ సంస్థ పలు సూచనలు చేసింది. వీలైనంత త్వరగా ఓపెన్ టెండర్లను పిలిచి తొలగించాలని, లేకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొంది. ఉచితం కోసం ఎదురు చూడాలా, సమర్థ సంస్థలకు టెండర్లు ఖరారు చేయాలా అని టీడీడీ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలిసింది.