Share News

మృత్యువులోనూ వీడని సోదరబంధం

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:15 AM

అర్ధగంట వ్యవధిలో అన్నదమ్ములిద్దరు తనువు చాలించిన వుదంతమిది. పుంగనూరు బజారువీధిలో సోదరులైన ఆర్‌.పురుషోత్తంశెట్టి(75), ఆర్‌.రాధాకృష్ణయ్యశెట్టి (67) జనరల్‌స్టోర్‌ నిర్వహిస్తున్నారు.

మృత్యువులోనూ వీడని సోదరబంధం
పురుషోత్తంశెట్టి

పుంగనూరులో విషాదం

పుంగనూరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి):అర్ధగంట వ్యవధిలో అన్నదమ్ములిద్దరు తనువు చాలించిన వుదంతమిది. పుంగనూరు బజారువీధిలో సోదరులైన ఆర్‌.పురుషోత్తంశెట్టి(75), ఆర్‌.రాధాకృష్ణయ్యశెట్టి (67) జనరల్‌స్టోర్‌ నిర్వహిస్తున్నారు.అన్న పురుషోత్తంశెట్టికి వివాహమైనా పిల్లలులేరు.రాధాకృష్ణయ్యశెట్టికి, వారి సోదరికి వివాహం కాకపోవడంతో అందరూ కలిసే వుంటున్నారు. సోమవారం సాయంత్రం రాధాకృష్ణయ్యశెట్టి (67) బాత్‌రూమ్‌ వద్ద కాలుజారి కిందపడగా గమనించిన అతని సోదరి దుకాణంలో ఉన్న పురుషోత్తంశెట్టికి విషయాన్ని చెప్పింది. పురుషోత్తంశెట్టి బాత్రూమ్‌ వద్దకు వెళ్లి పడిపోయిన తమ్ముడిని పైకిలేపుతుండగా ప్రమాదవశాత్తూ తలుపుగడిపై పడడంతో అతని తలకు గాయమైంది. చుట్టుపక్కల వాళ్లు రాధాకృష్ణయ్యశెట్టిని తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టగా ఆయన అప్పటికే మృతిచెందాడు. గాయపడిన పురుషోత్తంశెట్టిని చికిత్సకోసం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆయన అక్కడ చనిపోయారు. ఒకే కుటుంబంలో ఒకే రోజు, ఒకే గంటలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాతపడటంతో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - Nov 04 , 2025 | 01:15 AM