మామిడి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:29 AM
జిల్లాలోని మామిడి రైతుల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు.

- ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ డైరెక్టర్
- గిట్టుబాటు ధర, ఉత్పత్తులు, ఎగుమతులపై సాగిన సదస్సు
చిత్తూరు సెంట్రల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మామిడి రైతుల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ గ్రీన్‌లో భాగంగా శుక్రవారం స్థానిక ఎన్‌పీసీ పెవిలియన్ కన్వెన్షన్ సెంటర్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన చేపట్టిన మామిడి రైతులు, కొనుగోలుదారులు, విక్రయదారులతో సదస్సును ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. మామిడి సాగుతోపాటు ఉద్యాన పంటల ఉత్పాదకత, మార్కెటింగ్, ప్రాసెసింగ్, గిట్టుబాటు ధరపైనా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. 1.12 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలు చేయడంతో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. జిల్లాలో మామిడి పెంపకం, తెగుళ్ల నివారణపై శాస్త్రజ్ఞులతో పరిశోధనలు చేయిస్తున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మామిడికి గిట్టుబాటు ధర, మార్కెటింగ్, మ్యాంగో ఉత్పత్తుల ఎగుమతుల రంగాలను మెరుగుపర్చాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి దేశం నుంచి పలువురు రావడం శుభపరిణామమన్నారు. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలోని మామిడి ఉత్పత్తులకు టీటీడీ కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ మాట్లాడుతూ.. తిరుమలకు నడక దారిన వెళ్లే భక్తులకు ఇస్తున్న ఉచిత భోజనం, పాలు, మజ్జిగతోపాటు జిల్లాలో తయారుచేసే మామిడి ఉత్పత్తుల్లో ఒకటైన మ్యాంగో జ్యూస్ అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అసెంబ్లీ వేదికగా జిల్లాలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలనే తమ గళాన్ని వినిపించినట్లు గుర్తుచేశారు. అంతకుముందు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రముఖులు పరిశీలించారు. ఉద్యాన శాఖ అదనపు సంచాలకుడు హరినాథ్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, జేడీ దేవమునిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ అముద, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, ఆలిండియా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల చైర్మన్ జైట్లీ, చెన్నకేశవులు, బాబు, జగదీశ్వర్ నాయుడు పాల్గొన్నారు.
‘కాల్‌గుడి ఎఫ్‌పీవో’తో ఒప్పందం
సదస్సు ప్రారంభంలో ఈకామర్స్ ద్వారా మామిడి, ఉద్యాన ఉత్పత్తులు అమ్మకాలు చేపట్టడంపై హైదరాబాదుకు చెందిన ‘కాల్‌గుడి ఎఫ్‌పీవో’ కంపెనీ ప్రతినిధులతో వేదికపై రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఐదు సెషన్లలో మామిడి పంట సాగు, వాతావర ప్రతికూల పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడం, వాటి తెగుళ్లు, నివారణ, సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్తలు సూచనలు చేశారు.
ఇలాంటి సదస్సులతో ప్రయోజనం
ఎనిమిది ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నాను. ఇలాంటి సదస్సులతో రైతులకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాను. భవిష్యతులో మామిడి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను.
- ప్రభాకర రెడ్డి, జీడీ నెల్లూరు మండలం
గిట్టుబాటు ధర లేదు
రెండు ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నాను. ప్రతి ఏటా సాగు కోసం పెట్టుబడి ఎక్కువవుతున్నా.. గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులకు నష్టం రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.
- వాసుదేవరెడ్డి, గంగవరం మండలం
ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి
మామిడి రైతులకు పనిముట్లు, కవర్లు, పురుగుమందులు, తదితరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి. అపుడే రైతులకు కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.
- సిద్ధయ్యనాయుడు, గుడిపాల మండలం