‘తిరుపతి’ తొక్కిసలాటపై 200 పేజీలతో నివేదిక?
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:57 AM
‘తిరుపతి’ తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ గడువు ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలో 200 పేజీలతో తుది నివేదికను ఏకసభ్య న్యాయకమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు గురువారం ఆయన తిరుపతి కలెక్టరేట్‌లోని తన చాంబరులో నివేదిక కసరత్తులో నిమగ్నమైనట్లు సమాచారం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కేటాయింపులో భాగంగా జనవరి 8న తిరుపతి బైరాగిపట్టెడలోని పద్మావతిపార్కులో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 44మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిజనిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయకమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి పలు విడతలుగా విచారించారు. న్యాయవిచారణ తుది దశకు వచ్చింది.
కలెక్టరేట్‌లో తుది కసరత్తు
తిరుపతి(కలెక్టరేట్), జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి’ తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ గడువు ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలో 200 పేజీలతో తుది నివేదికను ఏకసభ్య న్యాయకమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు గురువారం ఆయన తిరుపతి కలెక్టరేట్‌లోని తన చాంబరులో నివేదిక కసరత్తులో నిమగ్నమైనట్లు సమాచారం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కేటాయింపులో భాగంగా జనవరి 8న తిరుపతి బైరాగిపట్టెడలోని పద్మావతిపార్కులో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 44మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిజనిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయకమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి పలు విడతలుగా విచారించారు. న్యాయవిచారణ తుది దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారమంతా విచారణకు సంబంధించి.. భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై నివేదిక రూపకల్పనకు కసరత్తు చేసినట్లు సమాచారం. పద్మావతి పార్కు వద్ద తొక్కిసలాట ఘటన గురించి కీలకమైన వీడియోలు కూడా కమిషన్‌కు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు అధికారులు.. కలెక్టరేట్‌లోని జస్టిస్ సత్యనారాయణమూర్తి చాంబర్ వద్దకు గురువారం మధ్యాహ్నం రాగా వీరిని కలవడానికి ఆయన ఇష్టపడలేదు. అక్కడి సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిద్దరూ వెళ్లిపోయారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని జస్టిస్ సత్యనారాయణమూర్తి విజయవాడకు తిరుగు పయ నం కానున్నట్లు సమాచారం. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారని తెలిసింది.