గ్రూప్2 బ్యాక్‌లాగ్ పోస్టుల పేరిట రూ.85 లక్షల మోసం
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:34 AM
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఎంప్లాయిమెంట్ ఆఫీసులో అధికారిని చెప్పారు.
తిరుపతి(నేర విభాగం), జూలై 13 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఎంప్లాయిమెంట్ ఆఫీసులో అధికారిని చెప్పారు. ఉద్యోగాలు తీసిస్తానని రూ.85 లక్షల వరకు వసూలు చేసి.. మోసం చేశారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బాధితులు శుక్రవారం మీడియాను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన ప్రకారం.. రెవెన్యూ విభాగంలో బ్యాక్‌లాగ్ (తహసీల్దారు, డీటీ, ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్) పోస్టులు ఇప్పిస్తామని తిరుపతి ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగినంటూ ఒకరు పరిచయం చేసుకున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారు. తన పిన్ని, బాబాయ్‌ని, మంగళగిరిలో ఓ ఉన్నతాధికారిని కలుపుకొని ప్లాన్ ప్రకారం నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, లెటర్ ప్యాడ్లు తయారు చేశారు. ఒప్పందం కుదిరిన అభ్యర్థులకు.. తిరుపతిలో ప్రభుత్వ తరహాలో పరీక్ష నిర్వహించారు. సెల్ఫ్ ఇంటర్వ్యూ, వీడియో తీసుకున్నారు. కాంపిటిటిట్ మెరిట్ లెటర్లు పంపారు. తర్వాత అపాయింట్‌మెంట్ లెటరు వస్తుందని, వేచి చూడాలని చెప్పారు. 14 నెలలుగా ఎదురు చూసినా అపాయింట్‌మెంట్ లెటర్లు రాలేదు. దీంతో వీరంతా రెండు నెలల కిందట సంబంధిత ఆఫీసుకు వెళ్లి అడగ్గా.. ఇవన్నీ నకిలీ లెటర్లని, నకిలీ స్టాంపులని చెప్పడంతో కంగుతిన్నారు. ఆ నలుగురిని ప్రశ్నించినా.. డబ్బులిచ్చేయమని బతిమలాడినా సమాధానం లేకపోగా, చివరకు ఎదురు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీంతో తిరుపతికి చెందిన దాదాపు 20 మందిలో 14 మంది బాధితులు ఎస్పీ హర్షవర్ధనరాజును కలిసి తమ గోడు చెప్పుకొన్నారు. రెండు నెలలవుతున్నా పోలీసుల నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌కు వచ్చి మీడియాకు వివరించారు. సోమవారం కలెక్టర్‌ను కలవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
కేసు దర్యాప్తులో ఉంది
బాధితులు ఎస్పీ హర్షవర్ధనరాజుకు రెండు నెలల కిందట ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఆయన విచారించి కేసు నమోదు చేయాలని తిరుపతి డీఎస్పీ భక్తవత్సలంను మే 24న ఆదేశించారు. ఈ కేసు తిరుపతి రూరల్ పరిధిలోది కావడంతో ఆయన.. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్‌కు పంపారు. ఈ అంశాన్ని తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందుతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం యర్రమరాజుపల్లెకి చెందిన ఎ.రాధాకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఉద్యోగినంటూ చెప్పిన పి.లక్ష్మితో పాటు పి.వేణుగోపాల్, పి.విద్య, హారికపై మే నెలలోనే కేసు నమోదు చేశామని.. దర్యాప్తు దశలో ఉందని సీఐ చెప్పారు.