డీఎస్సీకి 70 మంది అనర్హులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:55 AM
మెగా డీఎస్సీ 2025 ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 మంది అనర్హులయ్యారు. డీఎస్సీ మెరిట్ జాబితా అనుగుణంగా గత నెల 28 నుంచి చిత్తూరులోని ఎస్వీసెట్, అపోలో ఇంజనీరింగ్ కళాశాలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పలు దఫాలుగా సాగింది.
వెరిఫికేషన్ కమిటీల నిర్ధారణ
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ 2025 ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 మంది అనర్హులయ్యారు. డీఎస్సీ మెరిట్ జాబితా అనుగుణంగా గత నెల 28 నుంచి చిత్తూరులోని ఎస్వీసెట్, అపోలో ఇంజనీరింగ్ కళాశాలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పలు దఫాలుగా సాగింది. తొలి విడతలో 1200 మంది అభ్యర్థులు, మలి విడతలో 278 మంది అభ్యర్థులు కాగా, వీరిలో వివిధ కారణాలతో గైర్హాజరైన 45 మందికి మూడో విడతలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన సాగింది. ఆపై పూర్తిగా హాజరుకాని వారి జాబితా అధారంగా తదుపరి మెరిట్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేశారు. వీరితో పాటు దివ్యాంగుల కేటగిరిలోని అభ్యర్థులకు సైతం తిరుపతిలోని రుయా రెఫరెల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేశారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 183 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేకపోవడం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల్లో తేడాలు రావడం, ఇతర కారణాలతో అర్హత కోల్పోయినట్లు వెరిఫికేషన్ కమిటీలు నిర్ధారించాయి. 183 మంది అభ్యర్థులు ఒకటికిపైగా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. రిపీటెడ్ కౌంట్‌ను తొలగించగా, చివరకు 70 మంది అభ్యర్థులు తేలారు. దీంతో వీరి స్థానంలో మెరిట్ జాబితాలోని తదుపరి 70 మందికి రాష్ట్ర విద్యాశాఖ వెరిఫికేషన్ కాల్ లెటర్లు పంపనుంది. రాగానే ఈ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేస్తారు. మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి, ఈనెల 10వ తేదీ నాటికి మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.