Share News

తెగిన 55 చెరువులు

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:31 AM

తుఫాన్‌ కారణంగా పాడైన రహదారులకు, కల్వర్టులకు, చెరువులకు తాత్కాలిక మరమ్మతు పనులను ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.50 కోట్ల నిధులతో చేపడతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా 55 చెరువులు తెగిపోగా, 25 రహదారులు దెబ్బతిన్నాయన్నారు.

తెగిన 55 చెరువులు
నగరి మండల పరిధిలో మొరవ పారుతున్న ఓయూ కుప్పం చెరువు

దెబ్బతిన్న రహదారులు 25

రూ.2.50 కోట్ల నిధులతో తాత్కాలిక మరమ్మతులు

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా పాడైన రహదారులకు, కల్వర్టులకు, చెరువులకు తాత్కాలిక మరమ్మతు పనులను ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.50 కోట్ల నిధులతో చేపడతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా 55 చెరువులు తెగిపోగా, 25 రహదారులు దెబ్బతిన్నాయన్నారు. వీటి శాశ్వత పునరుద్ధరణ పనులకు ఒక్కో పనికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి మేర నిధులు కావాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతు పనులను చేయించి వేరే మార్గాల ద్వారా తర్వాత శాశ్వత పనులు చేపడతామన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈలతో సమావేశం నిర్వహించి 20 రోజుల్లోగా తాత్కాలిక మరమ్మతు పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు.వర్షాల కారణంగా 32 మండలాల్లో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు 75 శాతం నిండగా, భూగర్భ జలమట్టం పెరిగి 12 టీఎంసీల నీరు వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు సైతం చెరువుల నుంచి నీరు వృథాగా పోనివ్వకుండా కాపాడుకుంటూ భూగర్భజలమట్టం పెంచాలని సూచించారన్నారు.గుడుపల్లె, వి.కోట మండలాల్లో మాత్రం చెరువుల్లో నీరు చేరినా, భూగర్భ జలమట్టం తక్కువగా ఉందన్నారు. వంద ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని, వర్షాలు ఆగిపోయిన దృష్ట్యా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఖచ్చితమైన నష్ట వివరాలను సేకరిస్తామన్నారు. కుప్పంలో ఓ పారిశుధ్య కార్మికుడు మృతిచెందగా, గుడిపాల తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్లు కాలిపోయాయని, పలు ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలు కూలినట్లు నివేదికలు అందాయని చెప్పారు.

Updated Date - Oct 30 , 2025 | 12:31 AM