Share News

గృహ నిర్మాణాలకు 50,460మంది ముందుకొచ్చారు!

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:56 PM

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన గృహాల కోసం జిల్లా హౌసింగ్‌ కార్పొరేషన్‌ చేపట్టిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ సర్వే సోమవారంతో ముగిసింది.

 గృహ నిర్మాణాలకు  50,460మంది ముందుకొచ్చారు!
శాంతిపురం మండలం తుమ్మిశి పంచాయతీలో హౌసింగ్‌ సిబ్బంది సర్వే

చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన గృహాల కోసం జిల్లా హౌసింగ్‌ కార్పొరేషన్‌ చేపట్టిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ సర్వే సోమవారంతో ముగిసింది. పీడీ, డీఈలు, ఏఈలు, క్షేత్రస్థాయి సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది డోర్‌టు డోర్‌ సర్వే చేపట్టారు. వాస్తవానికి ఈ సర్వే గత నెల 15వ తేదీకి ముగియాల్సి ఉండగా, పలు దఫాలుగా గడువు తేదీలను పొడిగిస్తూ సోమవారానికి ముగించారు. దీంతో పీఎం ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లోని 50,460మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇందులో 42,142 మంది సొంత స్థలాల్లో గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు రాగా, 8336మంది తమకు స్థలాలు ఇస్తే ఇండ్లు కట్టుకుంటామని సర్వేలో చెప్పినట్లు హౌసింగ్‌ పీడీ సుబ్రమణ్యం తెలిపారు.వీరిని లబ్ధిదారులుగా గుర్తిస్తూ ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశామన్నారు. ఈ సమాచారాన్ని కలెక్టర్‌ ద్వారా రాష్ట్రప్రభుత్వానికి నివేదించామన్నారు.

లబ్ధిదారుల వివరాలు ఇలా...

గృహ నిర్మాణాలకు అత్యధికంగా వి.కోట మండలంలో 5,130మంది,అత్యల్పంగా పాలసముద్రంలో 543మంది ముందుకొచ్చారు.కుప్పంలో 4282మంది, రామకుప్పంలో 3867మంది, శాంతిపురంలో 3283మంది, పెద్దపంజాణిలో 3258మంది, గంగవరంలో 2767మంది, బైరెడ్డిపల్లెలో 2558మంది, గుడుపల్లెలో 2225మంది, బంగారుపాళ్యంలో 1855మంది, జీడీ నెల్లూరులో 1695మంది, పలమనేరులో 1678మంది, సోమలలో 1331మంది, పులిచెర్లలో 1108మంది, పుంగనూరులో 1089మంది, ఎస్‌ఆర్‌పురంలో 1067మంది, రొంపిచెర్లలో 1041మంది, పెనుమూరులో 1007మంది, చౌడేపల్లెలో 966మంది, సదుంలో 950మంది, తవణంపల్లెలో 947మంది, నగరిలో 923మంది, గుడిపాలలో 915మంది, ఐరాలలో 857మంది, వెదురుకుప్పంలో 852మంది, కార్వేటినగరంలో 766మంది, యాదమరిలో 726మంది, చిత్తూరులో 713మంది, నిండ్రలో 706మంది, విజయపురంలో 702మంది, పూతలపట్టులో 650 మంది లబ్ధిదారులను గుర్తించారు.

నిధుల కేటాయింపు ఇలా...

పీఎం ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు నిర్మించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.1.20 లక్షలు, ఉపాధి హామీ నిధుల నుంచి రూ.27 వేలు, స్వచ్ఛభారత్‌ నిధుల నుంచి రూ.12 వేల చొప్పున మొత్తం రూ.1.59 లక్షలు అందనున్నాయి.రాష్ట్రప్రభుత్వ వాటా ఇంకా నిర్ధారణ కాలేదు.

Updated Date - Dec 16 , 2025 | 11:56 PM