4966 బోగస్ పెన్షన్ల ఏరివేత
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:47 AM
మంచం పట్టామంటూ.....దివ్యాంగులమంటూ ప్రతి నెలా వేలాది రూపాయలు పింఛన్ రూపంలో అనుచిత లబ్ధి పొందుతున్న అనర్హులకు చెక్ పడింది.
వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా ఇచ్చిన పింఛన్ల సవరణ
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి) : మంచం పట్టామంటూ.....దివ్యాంగులమంటూ ప్రతి నెలా వేలాది రూపాయలు పింఛన్ రూపంలో అనుచిత లబ్ధి పొందుతున్న అనర్హులకు చెక్ పడింది.ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు తమ అనుయాయులకు అర్హత లేకున్నా పింఛన్ పేరిట లబ్ధి చేకూర్చారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పింఛన్లపై దృష్టి సారించి సర్వే చేయించింది.ఈ సర్వేలో వేలాదిమంది పింఛన్లకు అనర్హులని తేలింది.అత్యధికంగా దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందుతున్నవారున్నారు.జిల్లావ్యాప్తంగా 22,338 పింఛన్లు పునఃపరిశీలించగా, మరో 12,939 పింఛన్లు పునఃపరిశీలన చేయాల్సి ఉంది.పరిశీలించిన వాటిలో 17,064 పింఛన్లు సరైనవేనని తేలింది.545 పింఛన్లను వృధ్యాప్య పింఛన్లుగా మార్చారు.4,732 పింఛన్లు బోగస్‌గా తేల్చి రద్దు చేశారు. అలాగే జిల్లాలో నెలనెలా రూ.15 వేలు అందుకుంటున్న 1936మంది మంచాన పడిన(బెడ్ రిడన్) రోగుల పింఛన్లను పరిశీలించారు.వీరిలో 11 మంది చనిపోయారని, మరో 14 మంది స్థానికంగా లేనట్లు గుర్తించారు. మిగిలినవారిలో 783మందిని దివ్యాంగుల కేటరిగిలో రూ.6 వేల పింఛన్‌కు మార్చారు.మరో 70మందిని వృధ్యాప్య పింఛన్లకు మార్చారు. 824మంది మాత్రమే మంచాన పడిన రోగుల జాబితాలో అర్హత సాధించగా, 234 మంది బోగస్ పింఛన్ దారులుగా తేల్చి జాబితా నుంచి తొలగించారు.