వానలో.. అడవిలో 36 గంటలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:05 AM
ఏర్పేడు మండలం బత్తినయ్యకోనకు వెళ్లి శ్రీకాళహస్తికి చెందిన 22 మంది భక్తులు 36 గంటలపాటు అడవిలో చిక్కుకుపోయిన సంఘటన ఆందోళనకు గురి చేసింది.
ఏర్పేడు మండలం బత్తినయ్యకోనకు వెళ్లి శ్రీకాళహస్తికి చెందిన 22 మంది భక్తులు 36 గంటలపాటు అడవిలో చిక్కుకుపోయిన సంఘటన ఆందోళనకు గురి చేసింది. ఆదివారం బయలుదేరిన వీరు మంగళవారం సాయంత్రం దాకా కూడా తిరిగి రాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. వానలకు ఉధ్రుతంగా ప్రవహిస్తున్న వాగును దాటలేక, అడవిలో దారి తెలియక, సెల్ ఫోన్లు పనిచేయక, తిండికూడా లేక పసిబిడ్డలు మొదలు ముసలివాళ్ల దాకా విలవిలలాడిపోయారు. ముసలిపేడు స్థానికుల ధైర్యసాహసాలు, రెవెన్యూ, పోలీసుల సహకారంతో వీరంతా మంగళవారం రాత్రికి సురక్షితంగా అడవి దాటి బయటకు వచ్చారు. ఈ సంఘటనలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగాయి.
ఏర్పేడు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండలం బత్తినయ్య కోనలోని భక్తకంఠేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి నిద్ర చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకాళహస్తికి చెందిన 45 మంది ఆదివారం ట్రాక్టర్‌లో ముసలిపేడుకు చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే పడుకుని, తెల్లవారుజామునే నడక మొదలు పెట్టారు. సోమవారం ఉదయం బత్తినయ్య కోనకు చేరుకున్నారు. పూజలు చేసుకుని 23మంది సోమవారం సాయంత్రానికి తిరిగి వచ్చేశారు. కార్తీక సోమవారం రాత్రి భక్తకంఠేశ్వరస్వామి సన్నిధిలో నిద్రిస్తే మంచిదని మిగిలిన 22మంది అక్కడే ఉండిపోయారు. మంగళవారం ఉదయం లేచి కొండ దిగడం మొదలు పెట్టారు. ఒకవైపు వాన.. మరోవైపు చలి.. దారిలో పంబ కాలువ ఉధ్రుతంగా ప్రవహిస్తుండటంతో దాట లేకపోయారు. ఫోన్లు పనిచేయకపోవడంతో ఇళ్లకు సమాచారమిచ్చే వీలు లేకపోయింది. సాయంత్రం అవుతున్నా వాగు ఉధ్రుతి తగ్గలేదు. ఆకలి.. భయం.. ఆందోళన పెరిగిపోయాయి. నిజానికి వాగు దాటకుండా అడవిలో నడిచి బత్తినయ్య గిరిజనకాలనీకి చేరుకునే వీలుంది. వీరికి ఆ అడవిమార్గం తెలియలేదు. వీరిలో జంగం దేవర కుమారుడి ఫోన్ ఒక తావులో పనిచేయడంతో ముసలిపేడుకి సమాచారం ఇచ్చాడు. ముసలిపేడువాసులు ఏర్పేడు రెవెన్యూ, పోలీసు అఽధికారులకు సమాచారం అందించారు. వెంటనే తహసీల్దారు భార్గవి, ఎంపీడీవో సౌభాగ్యం, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో ముసలిపేడు గ్రామానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు చిక్కుకుపోయిన వాగు వద్దకు చేరుకున్నారు. ఎక్స్‌కవేటర్‌సాయంతో అధికారులు కాలువను దాటడానికి ప్రయత్నించినా నీటి ఉధ్రుతి పెరుగుతూనే ఉండడంతో సాధ్యం కాలేదు. ఈ క్రమంలో నలుగురు స్థానికులు సాహసించి తాడు సాయంతో కాలువ దాటి అవతలకు వెళ్లారు. అప్పటికే చిక్కుకుపోయిన వారు తిండిలేక నీరసించిపోయి ఉన్నారు. వారిని అడవిదారిలో బత్తినయ్య గిరిజనకాలనీకి తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని డోలిలో కిందకు మోసుకువచ్చారు. 22 మందికీ పాపానాయుడుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యపరీక్షలు చేశారు. కోన నుంచి ముసలిపేడుకు చేరుకున్న భక్తులకు టీడీపీ మండల అధ్యక్షుడు పేరం నాగరాజునాయుడు, మనోహర్‌నాయుడు, అంకయ్య ఆధ్వర్యంలో భోజనం అందించారు. అక్కడ్నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. తమను కాపాడిన అధికారులకు, ముసలిపేడు వాసులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.