డీసీసీబీ లాభాల్లో రైతులకు 2.25 శాతం డివిడెండ్
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:10 AM
డీసీసీ బ్యాంకుకు వచ్చిన లాభాల్లో రైతులకు 2.25 శాతం డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి సి. శంకరబాబు తెలిపారు
డీసీసీబీ సీఈవో సి. శంకరబాబు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): డీసీసీ బ్యాంకుకు వచ్చిన లాభాల్లో రైతులకు 2.25 శాతం డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి సి. శంకరబాబు తెలిపారు. 2024-25వ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుకు రూ.17.26 కోట్ల లాభాలు(ప్రొవిజినల్ లాభం) వచ్చాయని, ఇందులో రూ.12.76 కోట్లు నికర లాభం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఆడిట్ తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఈ మొత్తంలో రూ.1.90 కోట్లు బ్యాంకులో సభ్యత్వం ఉన్న అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా (సింగిల్ విండోలు)ల్లో ఎ క్లాస్ సభ్యులకు డివిడెండ్ కింద చెల్లిస్తామన్నారు.
రూ.4430 కోట్ల వ్యాపారం
2025-26వ ఆర్థిక సంవత్సరంలో రూ.4430 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో స్వల్పకాలికేతర (ఎస్టీ) రుణాలు రూ.550 కోట్లు, పంట రుణాలు రూ.700 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో మరే డీసీసీబీలో ఇవ్వని విధంగా బంగారం కుదువపై రుణాల రూపేణా రూ.1150 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. 2024-25లో బంగారం కుదువపై రూ.876కోట్లు వ్యవసాయదారులకు అందించాం. ఇందులో వ్యవసాయ రుణాలుగా రూ.56 కోట్లు, వ్యవసాయేతర రుణాలుగా రూ.820 కోట్లు అందించాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3450 కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో రుణాల కింద రూ.2436 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన రూ.998 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయి.
మొండి బకాయిలు
డీసీసీ బ్యాంకుకు సుమారు రూ.85 కోట్ల వరకు మొండిబకాయిలున్నాయి.వీటిపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతి బ్రాంచ్ నుంచి రెండు ఖాతాలకు చెందిన భూములను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గాయి. 2023-24లో ఎన్పీఏ 3.51శాతం ఉంటే, 2024-25 సంవత్సరానికి 3.45 శాతానికి తగ్గింది.
డిపాజిట్ల సేకరణ
డిపాజిట్ల సేకరణపై ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారిస్తాం. దీనివల్ల బ్యాంకుకు సొంత వనరులు సమకూరుతాయి. 2023-24లో రూ.932 కోట్లు, 2024-25లో రూ.998 కోట్లు డిపాజిట్లు సేకరించాం. ఇతర బ్యాంకులతో పోలిస్తే చిత్తూరు డీసీసీబీ నుంచి ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాం. 333 రోజులకు మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అవణి డిపాజిట్ స్కీమ్ కింద 8.50 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు ఇతర బ్యాంకులకన్నా 0.50శాతం వడ్డీ అధికంగా ఇస్తున్నాం. త్వరలో నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.