కరెంటోళ్ల జనబాటలో 2,117 సమస్యల గుర్తింపు
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:42 AM
విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషం తెలిసిందే.
- 75 సమస్యలకు వెంటనే పరిష్కారం: ఎస్‌ఈ
చిత్తూరు రూరల్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషం తెలిసిందే. వారంలో రెండ్రోజులపాటు మంగళవారం, శనివారాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి వినియోగదారుల సమస్యలను స్వయంగా పరిశీలించాలి. వాటిని వీలైతే అక్కడే, లేకుంటే నిర్ణేత సమయంలోపు పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లాలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని చిత్తూరు రూరల్ మండలం నుంచి చిత్తూరు ఆపరేషన్ డివిజన్ ఈఈ మునిచంద్ర ప్రారంభించారు. ముందుగా తాళంబేడు గ్రామం, కాలనీలో ఏఈతో కలిసి పర్యటించారు. అక్కడ గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడారు. 15 సమస్యలను గుర్తించగా నాలుగు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటే విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఈఈ సూచించారు.
జిల్లావ్యాప్తంగా ఇలా..
జిల్లా వ్యాప్తంగా తొలిరోజే 2,117 సమస్యలను అధికారులు గుర్తించారు. ఇందులో అప్పటికప్పుడే 75 సమస్యలను పరిష్కరించామని ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 11 కేవీ లైన్ సంబంధించి 1038 సమస్యలు గుర్తించగా అందులో 56 పరిష్కరించారు. ట్రాన్స్‌ఫార్మర్లకు 136, ఎల్‌టీ లైన్లకు సంబంధించి 808 సమస్యలు గుర్తిస్తే 16 పరిష్కరించారు. సర్వీస్ లైన్లకు సంబంధించి 135 సమస్యలు రాగా, మూడింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన 2042 సమస్యలను నిర్ణేత సమయంలోపు పరిష్కరిస్తామని ఎస్‌ఈ పేర్కొన్నారు.