21 రోజులు 29,657 వినతులు
ABN , Publish Date - May 28 , 2025 | 02:20 AM
కూటమి అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లేని వారికి కొత్తవి అందించేందుకు శ్రీకారం చుట్టింది.
కొత్త రేషన్ కార్డులు.. మార్పులు, చేర్పులకు దరఖాస్తుల వెల్లువ
అన్ని సంక్షేమ పథకాలకు కేంద్ర బిందువు బియ్యం కార్డు. అర్హులై కార్డుల్లేనివారు, మార్పులు చేర్పులు చేసుకోవడానికి పదేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో 21 రోజుల వ్యవధిలోనే లబ్ధిదారులు, కార్డుదారుల నుంచి దాదాపు 29,657 దరఖాస్తులు అందాయి.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
కూటమి అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లేని వారికి కొత్తవి అందించేందుకు శ్రీకారం చుట్టింది. గత పదేళ్లుగా కొత్త కార్డులు మంజూరు లేకపోవడంతో ఇప్పటి వరకు నిరీక్షిస్తున్న వారికి శుభవార్త చెబుతూ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజుటి నుంచి కొత్త కార్డుల కోసం.. ఉన్న వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి దరఖాస్తులతో మీ-సేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలకు లబ్ధిదారులు పరుగులు పెడుతున్నారు. దరఖాస్తు ప్రక్రియలో 10 రోజులుగా సర్వర్లు మొరాయించాయి. ప్రస్తుతం సర్వర్ల పనితీరు కొంత మెరుగు పడడంతో దరఖాస్తుదారులు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసి వస్తున్నారు. ప్రధానంగా గతంలో చేసిన హౌస్ హోల్డ్ ఆధారంగా దరఖాస్తులను సంబంధిత సచివాలయాల్లో స్వీకరిస్తున్నారు. గత 21 రోజుల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా దాదాపు 29,657 దరఖాస్తులు అందాయి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
మొదట కొత్త కార్డులు, మార్పులు, చేర్పుల కోసం సచివాలయాలకు వెళ్ళిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో నమోదు చేస్తారు. అక్కడ నుంచి వీఆర్‌వోల లాగిన్‌కు పంపుతారు. అక్కడ పూర్తి వివరాలు పరిశీలిస్తారు. ఈకేవైసీ పూర్తి చేశారా లేదా అనేది ధ్రువీకరించాక సంబంధిత తహసిల్దార్ల లాగిన్‌కు పంపుతారు. అక్కడ నిబంధనల ప్రకారం ఆమోదం తెలిపిన తర్వాత అర్జీదారులకు రేషన్ కార్డు నెంబరుతో సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుందని డీఎ్‌సవో శేషాచలం రాజు చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా కార్డుల విభజనకు సంబంధించి వచ్చాయి. ఇక, గత వైసీపీ ప్రభుత్వం బియ్యం కార్డులపై జగన్ బొమ్మను ముద్రించింది. తాజాగా ప్రభుత్వం లోగో ఉన్న స్మార్ట్ కార్డుల జారీకి చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి జూన్ నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నారు.
ఇది నిరంతర ప్రక్రియ
కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం, కార్డుల్లో మార్పులు, చేర్పులనేవి నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. కొత్తగా వివాహమైన జంటలు అప్పటికప్పుడు దరఖాస్తు చేసి కార్డులు పొందవచ్చు. కొత్త కార్డుల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. దరఖాస్తు చేసిన వారం, 10 రోజుల్లో కార్డులు ఇంటికి వస్తాయి.
- శేషాచలం రాజు, డీఎ్‌సవో
విభాగాల వారీగా వచ్చిన
దరఖాస్తులు
కొత్త కార్డుల కోసం వచ్చిన
దరఖాస్తులు: 4222
అడ్రస్ మార్పులు: 1217
కార్డుల విభజన కోసం: 2308
సభ్యుల చేరిక: 20,870
కార్డులు సరెండర్ చేసినవి: 25
సభ్యుల తొలగింపు: 684
ఆధార్ సవరణ: 330
మొత్తం దరఖాస్తులు : 29,657