సంక్షేమాభివృద్ధిలో 2025 సక్సెస్
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:32 AM
ఎన్నికల హామీలను 2025లో కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి చెప్పారు.
టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి
తిరుపతి, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలను 2025లో కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి చెప్పారు. మంగళవారం తిరుపతిలోని పార్లమెంటు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముందుకువెళ్తోందన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువున్నా ఆర్థిక సాయం, స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా, మత్స్యకార భరోసా, నేతన్నలకు ఉచిత విద్యుత్, అన్నాక్యాంటీన్ల పునఃప్రారంభం, మెగా డీఎస్సీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నామన్నారు. రూ3లక్షల కోట్ల పెట్టుబడులతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ స్థాపన, విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రంగా 3 ప్రాంతాల అభివృద్ధి, సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్‌కు ఊతం, లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, కొత్త జిల్లాల ఏర్పాటువంటివి 2025లోనే పునాదులు పడ్డాయన్నారు. 2026 నూతన సంవత్సరంలో మరింతగా అబివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కృషిచేస్తున్నామన్నారు. ఈసమావేశంలో పార్లమెంటు కమిటీ టీడీపీ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు.