పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 02:04 AM
పదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి చిత్తూరు పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.సోమల మండలం చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ (46) 2020 జూలై 20వ తేదిన ఓ చిన్నారి స్నేహితులతో ఆడుకుంటుండగా చాక్లెట్ కొనిపెడతానంటూ మాయమాటలు చెప్పి ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

చిత్తూరు లీగల్/సోమల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి చిత్తూరు పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.సోమల మండలం చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ (46) 2020 జూలై 20వ తేదిన ఓ చిన్నారి స్నేహితులతో ఆడుకుంటుండగా చాక్లెట్ కొనిపెడతానంటూ మాయమాటలు చెప్పి ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఆ చిన్నారి ఏడుస్తూ ఇంటికెళ్ళగా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాబూప్రసాద్ దర్యాప్తు చేపట్టి నాలుగురోజుల తరువాత ముద్దాయిని ఎస్.నడింపల్లె వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ కేసు శుక్రవారం చిత్తూరు పోక్సో కోర్టులో విచారణకు రాగా, పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి శంకర్రావు నిందితుడు రామకృష్ణకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసును ఏపీపీ మోహనకుమారి వాదించారు.ముద్దాయికి శిక్ష పడేలా చేసిన పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, చౌడేపల్లె సీఐ రాంభూపాల్, సోమల పోలీసులను ఎస్పీ మణికంఠ అభినందించారని సోమల ఎస్‌ఐ శివశంకర తెలిపారు.