Share News

20 మందికి రాష్ట్రస్థాయి ‘ఉత్తమ’ ఉపాధ్యాయ అవార్డులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:30 AM

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. బోధన, పరిశోధన రంగాల్లో వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. శుక్రవారం అమరావతిలో జరగనున్న గురుపూజోత్సవంలో వీరు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు.

20 మందికి రాష్ట్రస్థాయి ‘ఉత్తమ’ ఉపాధ్యాయ అవార్డులు

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. బోధన, పరిశోధన రంగాల్లో వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. శుక్రవారం అమరావతిలో జరగనున్న గురుపూజోత్సవంలో వీరు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు.

విద్యావిధానంపై పరిశోధన

పొన్నంరెడ్డి కుమారి నీరజ.. శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలు. విద్యావిధానంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పరిశోధనలు చేశారు. విద్యార్థులకు అర్థవంతమైన బోధనతో పాటు పరిశోధనలపై ఆసక్తి కల్పిస్తున్నారామె.

క్రమశిక్షణాపథం

గంగారామ్‌.. శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్‌ లెక్చరర్‌. తన బోధనతో విద్యార్థులను ప్రభావితం చూస్తూ ఉత్తమ పథంలో నడిపిస్తున్నారు. ఆర్థిక, వ్యక్తిగత క్రమశిక్షణను నేర్పిస్తున్నారు.

ఆయన ఓ ఇన్‌స్పైర్‌

సుబ్రహ్మణ్యం శర్మ.. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్‌ టీచరు. బోధనతో పాటు ప్రయోగాలు చేయిస్తూ విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌, సైన్స్‌ ప్రదర్శనల విషయంలో చొరవ చూపి విద్యార్థులను తీసుకెళ్లారు.

క్రీడాసక్తికి పునాది

రామకృష్ణ.. శ్రీకాళహస్తి మండలం ఎగువువీధి ప్రభుత్వ పాఠశాలలో పీడీ. స్వస్థలం అనకాపల్లి జిల్లా నాతవరం. పుష్కరకాలంగా అమ్మ ఎడ్యుకేషన్‌ఫౌండేషన్‌ సంస్థ ద్వారా ఎందరో విద్యార్థులకు సొంత నిధులు వెచ్చించి క్రీడలపై ఆసక్తి పెంచారు. పేద విద్యార్థులను రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. అత్యవసరమైతే విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు.

సులభ బోధనకు పెట్టింది పేరు

బాలసుబ్రహ్మణ్యం.. తొట్టంబేడు మండలం సాంబయ్యపాళెం ప్రభుత్వ పాఠశాలలో టీచరు. తెలుగులో పలు రచనలు సాగించడంతో పాటు మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. అట్టముక్కలు, వివిధ సులభమైన మార్గాల ద్వారా పిల్లలకు విద్యాబోధన చేస్తూ మేధస్సుకు పదును పెడుతుంటారు. ఆయన రచించిన సీతాకోకచిలు పద్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించింది.

ఉత్తమ ప్రిన్సిపాల్‌గా ఎస్వీ కుమార్‌

పుత్తూరు, ఆంధ్రజ్యోతి: పుత్తూరు మండలం పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు చెందిన ఎస్వీ కుమార్‌ రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్‌గా ఎంపికయ్యారు. 1992లో లెక్చరర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈయన తాను పనిచేసిన కళాశాలల్లో పలు కంపెనీలతో మాట్లాడి జాబ్‌ మేళాలను నిర్వహించారు.

అర్థమయ్యే రీతిలో బోధన

చంద్రగిరి, ఆంధ్రజ్యోతి: చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సివిక్స్‌ అధ్యాపకుడు చీర్ల వెంకటరమణ రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. అర్థమయ్యే రీతిలో బోధించడంలో ఈయన గుర్తింపు పొందారు.

13 మంది వర్సిటీ అధ్యాపకులకూ..

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బోధన, పరిశోధన, విస్తరణ, సేవ తదితర రంగాల్లో కృషికి గుర్తింపుగా తిరుపతిలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో 13 మంది ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు.

ఎస్వీ యూనివర్సిటీ: ప్రొఫెసర్లు టి.రమాశ్రీ (ఈసీఈ), ఎం.బాలాజీ (బయోకెమిస్ట్రీ), అఖిల స్వతంత్ర (మెకానికల్‌ ఇంజినీరింగ్‌), టి.విజయ (బోటనీ), టి.చంద్రశేఖరయ్య (పాపులేషన్‌ స్టడీస్‌), డి.సుబ్బారావు (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)

పద్మావతి యూనివర్సిటీ: ప్రొఫెసర్లు వైఎస్‌ శారద (ఇంగ్లీషు), ఎం.అరుణ (హోంసైన్స్‌), పెంచలనేని జ్యోత్స్న (బయో టెక్నాలజీ), పి.వెంకటకృష్ణ (కంప్యూటర్‌సైన్స్‌), రమ్యాకుబేర్‌ (ఫార్మసీ), పద్మావతి జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి. భువనేశ్వరిదేవి (జువాలజీ)తో పాటు ఎస్వీ వ్యవసాయ కాలేజీలో డాక్టర్‌ డి. సుబ్రమణ్యం (అగ్రానమీ) కూడా పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated Date - Sep 05 , 2025 | 01:30 AM