బాలిరెడ్డిగారిపల్లి వద్ద 16 ఏనుగుల హల్‌చల్
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:50 PM
హైవే సమీపంలోని బాలిరెడ్డిగారిపల్లి వద్ద బుధవారం పగలంతా పదహారు ఏనుగుల మంద హల్‌చల్ చేశాయి
కల్లూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం కల్లూరు-పీలేరు హైవే సమీపంలోని బాలిరెడ్డిగారిపల్లి వద్ద బుధవారం పగలంతా పదహారు ఏనుగుల మంద హల్‌చల్ చేశాయి. కల్లూరు- అయ్యావాండ్లపల్లి రోడ్డుకు ఆనుకొని ఉన్న మామిడితోటలో గజరాజులు తిష్ఠ వేయడంతో అటవీశాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందారు.ఏనుగుల గుంపు ఉన్న మామిడితోటను సిబ్బంది చుట్టుముట్టారు. తోటలో నుంచి బయటకు రాకుండా నలువైపులా టపాకాయలు పేల్చడంతో ఏనుగులు కోపంతో ఘీంకారాలు చేశాయి. కొంతదూరం ట్రాకర్స్‌ను ఏనుగులు తరుముకుని చెమటలు పెట్టించాయి. మామిడితోట నుంచి పగటి వేళలో ఏనుగుల గుంపు బయటకు వస్తే ప్రజలకు ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫీ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ముందుగా మంగళవారం రాత్రి తూర్పు విభాగ అటవీ ప్రాంతంలోని సూరప్పచెరువు నుంచి రెండు గున్న ఏనుగులతో కలిసి 16 ఏనుగుల మంద కుమ్మరిపల్లె వద్దకు చేరుకున్నాయి.రవికుమార్, ధర్మేంద్ర, బాబుకు చెందిన మామిడి, కొబ్బరిచెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు పశుగ్రాసం తినేసి రాతికూసాలను విరిచేశాయి. అక్కడి నుంచి కల్లూరు-పులిచెర్ల రోడ్డును దాటుకున్న ఏనుగుల మంద వీకే పల్లి వద్దకు చేరుకొని రెడ్డిశేఖర్ నాయుడికి చెందిన మామిడిచెట్ల కొమ్మలను, రాతికూసాలను విరిచేశాయి. అక్కడి నుంచి బాలిరెడ్డిగారిపల్లి, నల్లగుట్టపల్లి, అయ్యావాండ్లపల్లి, యర్రంవాండ్లపల్లి వరకు వెళ్లిన ఏనుగులు పలురకాల పంటలను ధ్వంసం చేశాయి. చెరుకువారిపల్లిలో దామోదర్‌కు చెందిన పొలంలో బీభత్సం చేసిన ఏనుగుల మంద టమోటా, కాలీఫ్లవర్ పంటలను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టిన ఏనుగులు మునిరెడ్డిగారిపల్లి వద్దకు చేరుకోవడంతో తెల్లారింది. బాలిరెడ్డిగారిపల్లిలో మునిరెడ్డి, మధురెడ్డి, అమరనాథరెడ్డి, ప్రతా్‌పరెడ్డికి చెందిన మామిడిచెట్ల కొమ్మలను విరుస్తూ ఘీంకారం చేయడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు టపాకాయలు పేల్చడంతో సిబ్బందిపై అవి తిరగబడ్డాయి. దీంతో ట్రాకర్స్ ప్రాణ భయంతో పరుగులు తీశారు. కల్లూరు- అయ్యావాండ్లపల్లి రోడ్డు సమీపంలో ఉన్న సోమసుందర్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డికి చెందిన మామిడితోటలో ఏనుగుల మంద నిలకడగా నిలబడ్డాయి. సమాచారం అందుకున్న రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫీ, ఎఫ్‌బీవోలు కృష్ణమూర్తి, మధు సిబ్బందితో హుటాహుటిన మామిడితోట వద్దకు చేరుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన అటవీశాఖ అధికారులు కల్లూరు- అయ్యావాండ్లపల్లి రోడ్డుపై ఎలాంటి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ప్రాంతంలో ఏనుగుల మంద సేదతీరాయి. సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వర్షం కురవడంతో చీకటిగా మారింది. అంతవరకు ఏనుగుల మంద సమీపంలో ఉన్న అటవీశాఖ అధికారులు, ట్రాకర్స్ సమీపంలోని బాలిరెడ్డిగారిపల్లిలోకి వెళ్లిపోవడంతో ఏనుగుల మంద మామిడితోటల మధ్యలోకి వెళ్లిపోయాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏనుగుల మంద గ్రామాల మధ్యలోకి రావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రేంజర్ థామస్ సుకుమార్ సూచించారు. సాధారణంగా ఏనుగులు పగలంతా అడవిలో ఉంటూ రాత్రి వేళల్లో పొలాల్లోకి చేరుకొని పంటలను ధ్వంసం చేసేవన్నారు. అయితే ఏనుగుల గుంపులో రెండు గున్న ఏనుగులు ఉండటంతో బుధవారం ఉదయానికి తిరిగి అడవికి వెళ్లడంలో ఆలస్యమైందన్నారు. దీంతో మామిడితోటలో మాటు వేశాయని రేంజర్ తెలిపారు.