15వ ఆర్ఢిక సంఘం నిధులు విడుదల చేయాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:20 AM
గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ కోరారు.
తిరుపతి(ఎమ్మార్‌పల్లె), ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ కోరారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను దారి మళ్లించిందని గుర్తు చేశారు. తద్వారా గ్రామాల్లో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, అదే జరిగితే గ్రామ పంచాయతీలు మరింతగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చెంపుల సత్యనారాయణరెడ్డి, సర్పంచుల సంఘం తెలంగాణ గౌరవాధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో సౌకర్యాలు కల్పిస్తే పర్యావరణ హితానికి తోడ్పాటు అందించిన వారమవుతామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, వేణుగోపాల్, మురళి, అనిల్ పాల్గొన్నారు.