Share News

పవన్‌పై దాడి వెనుక 15 మంది

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:29 AM

పవన్‌కుమార్‌పై దాడి ఘటనలో పోలీసులు విచారించే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

పవన్‌పై దాడి వెనుక 15 మంది

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో పవన్‌కుమార్‌పై దాడి ఘటనలో పోలీసులు విచారించే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక మొత్తం 15 మంది ఉన్నట్లు.. వారిలో తిరుపతికి చెందిన ఐదారుగురు కీలక నేతల హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన వైసీపీ సోషల్‌ మీడియా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ రెడ్డి, అతని అనుచరుడు జగదీశ్వరరెడ్డి, దినే్‌షను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో పాకాలకు చెందిన వైసీపీ నేత దినేష్‌ పవన్‌ను ఫైబర్‌ లాఠీతో పాటు దుడ్డు కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఇతడిని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఇక, పవన్‌కుమార్‌ను దాడి తర్వాత చిత్తూరుకు కారులో తీసుకెళ్ళి అక్కడ బంధించి షెల్టర్‌ ఇప్పించిన ఐదుగురిని పోలీసులు గుర్తించి, విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పవన్‌కుమార్‌తో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయి? అతడు పనిచేస్తున్న లాడ్జి యజమాని, మేనేజర్‌ను విచారణ చేస్తున్నట్లు తెలిసింది. బాధితుడు పవన్‌తోపాటు, అరెస్టయిన ముగ్గురు నిందితుల మొబైల్‌ ఫోన్లు సీజ్‌ చేసిన పోలీసులు, వారి కాల్‌ డేటాను సమగ్రంగా పరిశీలించారు. నెల రోజులుగా ఎవరెవరితో మాట్లాడారనే కాల్‌ డేటా తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు సాంకేతిక ఆధారాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో కేసును ఛేదించే పనిలో తిరుపతి పోలీసులున్నారు. ఇక, తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి పవన్‌కుమార్‌ను ఎవరు.. ఏ రూటులో తీసుకెళ్లారనేది సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనిల్‌కుమార్‌ రెడ్ది బైక్‌ రెంటల్‌ కార్యాలయంలో వున్న సీసీ కెమెరాలనుంచీ ఫుటేజీలను సేకరించారు. అన్ని ఆధారాలతో సమగ్రమైన వివరాలతో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:29 AM