CM Chandrababu : నీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తవ్వాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:04 AM
గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తికావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అలా పూర్తి చేయకపోతే కాంట్రాక్టు సంస్థలు, అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. 2027 డిసెంబరునాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని.. దాని ఫలితాలు వచ్చేలోగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫలాలు ఆ ప్రాంత

లేదంటే కాంట్రాక్టు సంస్థలు, అధికారులే బాధ్యులు: సీఎం
2027 చివరికి పోలవరం పూర్తికావాలి
పనులపై నిరంతరం సమీక్షించుకోవాలి
ప్రాజెక్టు ఫలితాలు వచ్చేలోగా
ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి ఫలాలు!
వెలిగొండ 30 ఏళ్లుగా పూర్తికాకపోవడం బాధాకరం
భూగర్భజలాలపై మంత్రులతో కమిటీ
‘బనకచర్ల’కు ప్రత్యేక కార్పొరేషన్: బాబు
మూడు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం
2026 నాటికి హంద్రీ-నీవా తొలిదశ
మే నెలకల్లా పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్ పూర్తి
జలవనరుల శాఖ కార్యాచరణ
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తికావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అలా పూర్తి చేయకపోతే కాంట్రాక్టు సంస్థలు, అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. 2027 డిసెంబరునాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని.. దాని ఫలితాలు వచ్చేలోగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫలాలు ఆ ప్రాంత ప్రజలకు దక్కాలని చెప్పారు. గురువారమిక్కడ వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖపై ఆయన సమీక్షించారు. పోలవరం పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1,379 మీటర్ల డయాఫ్రం వాల్.. ఇప్పటికి 51 మీటర్ల మేర పూర్తయిందని తెలిపారు. కుడి, ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం ఉందన్నారు. వచ్చే సమీక్ష నాటికి పోలవరం కనెక్టివిటీ పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ‘పోలవరం నిర్మాణం రోజువారీగా ఎంత జరగాలి.. ఎంత జరిగిందో కాంట్రాక్టు సంస్థలు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. లక్ష్యాల మేరకు పనులు పూర్తిచేయకపోతే వారినే బాధ్యులను చేస్తాం. హెడ్‌వర్క్ప్ పనులు 2027 డిసెంబరునాటికి పూర్తిచేయాల్సిందే. మొదట 17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో డిజైన్ చేసినట్లుగానే కాలువల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ఎడమ కాలువ పనులు ఈ ఏడాది పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు తరలించే చర్యలు చేపట్టాలి. చింతలపూడి ఎత్తిపోతలపై న్యాయస్థానంలో ఉన్న కేసులను పరిష్కరించాలి’ అని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల జాప్యంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని.. 30 ఏళ్లుగా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపు తన స్వప్నమని చంద్రబాబు అన్నారు. ‘భూగర్భజలాలు 3నుంచి 9మీటర్ల లోతులోనే లభ్యం కావాలి. పంచాయతీరాజ్, అటవీ, జల వనరులు, వ్యవసాయ, పురపాలక శాఖల మంత్రులతో కమిటీని వేయాలి. భూగర్భజలాల పెంపుపై ఈ కమిటీ నిర్మాణాత్మకమైన ఆలోచనలను అమలు చేయాలి’ అని సూచించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రాజెక్టులపై కార్యాచరణ
వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన ప్రాజెక్టుల వేగాన్ని పెంచి కార్యాచరణ లక్ష్యం మేరకు పూర్తిచేయాలని జలవనరుల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పోలవరం-బనకచర్ల అనుసంధానం పథకాన్ని మూడు దశల్లో పూర్తి చేస్తామని సీఎం సమీక్షలో కార్యాచరణను వెల్లడించింది. దీనిలో భాగంగా ఏటా జూలై 1 నుంచి 100 రోజులపాటు రోజుకు 2.46 టీఎంసీల చొప్పున 246 టీఎంసీలను తరలిస్తారు. కుడి ప్రధాన కాలువను 17,500 నుంచి 35,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి విస్తరిస్తారు. మొదటి దశలో తాటిపూడి వరద కాలువ వద్ద 18,000 క్యూసెక్కులను.. మిగిలిన 17,500 క్యూసెక్కులను కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. సెగ్మెంట్-2లో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లికి గోదావరి జలాలను తరలిస్తారు. వైకుంఠపురం హెడ్‌వర్క్స్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయరుకు తరలిస్తారు. ఇందుకోసం 6 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయరును 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తారు. 15హేబిటేషన్ల గుండా 31 కిలోమీటర్ల గోదావరి జలాలను తరలేలా కార్యాచరణ సిద్ధం చేశారు. గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువకు అనుసంధానం చేస్తారు. మూడో సెగ్మెంట్‌లో బొల్లాపల్లి నుంచి 115 కిమీ మేర బనకచర్లకు 23,000 క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు. కాగా, కూటమి ప్రభుత్వంలో ఆరు నెలలకే అంటే డిసెంబరు నాటికే 77.31ు మేర పోలవరం ప్రాజెక్టు పనులు (5.38ు) పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ పనులు ఈ ఏడాది చివరకు పూర్తవుతాయి. కాగా..హంద్రీ-నీవా తొలిదశ పనులను 2026కల్లా పూర్తిచేయాలని జలవనరుల శాఖ డెడ్‌లైన్ పెట్టుకుంది. ఈ ఏడాది మే నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్ పూర్తి చేయాలని కార్యాచరణ సిద్ధం చేసింది.