Share News

Chandranna Insurance : చంద్రన్న బీమా .. ఏదీ ధీమా ?

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:37 PM

తాడేపల్లిగూడెంకి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు చంద్రన్న బీమా ఉంది. కుటుంబ సభ్యులు సచివాలయంలో ఆన్లైన్ చేయించారు.

Chandranna Insurance : చంద్రన్న బీమా .. ఏదీ ధీమా ?
Chandranna Insurance

  • చంద్రన్న బీమా కోసం ఎదురుచూపులు

  • రెండేళ్లుగా పెండింగ్‌లో దరఖాస్తులు

  • గత ప్రభుత్వ హయాంలో 397 మందికి పెండింగ్

  • ఆన్లైన్లో కనిపించని వివరాలు

  • లబ్ధిదారుల్లో అయోమయం


భీమవరం టౌన్, సెప్టెంబరు 18 (ఆంద్రజ్యోతి): తాడేపల్లిగూడేనికి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు చంద్రన్న బీమా ఉంది. కుటుంబ సభ్యులు సచివాలయంలో ఆన్లైన్ చేయించారు. ఏడాది కావస్తోంది.. బీమా వస్తుందా? రాదా అనేది తెలియని పరిస్థితి. కార్యాలయాలకు వెళ్లినా సరైన సమాచారం అందని పరిస్థితి? చంద్రన్న బీమా పథకం అమలుపై అయోమయ పరిస్థితి నెలకొంది.

పేద ప్రజలకు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం కింద బీమా సౌకర్యం కల్పించింది. జిల్లాలో అప్పట్లో 5,15,766 మంది రేషన్ కార్డుదారులు ఉంటే అందులో అర్హులైన 426,002 మందికి బీమా సౌకర్యం కల్పించారు. పథకంలో నమోదైనవారు మరణిస్తే వారి కుంటుంబాలకు బీమా అందించేవారు. సహజ మరణాలకు రూ.2 లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5. లక్షలు ఇచ్చేవారు. తర్వాత వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత వైస్సార్ బీమాగా మార్చారు. పథకంలో మార్పులు చేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని కూటమి ప్రకటించింది. ఈ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకాన్ని సెర్చ్ (పేదరిక నిర్మూలన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. బీమా మిత్రల ద్వారా అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చనిపోయినా, ఎవరు చనిపోయినా వారికి బీమా ఉంటే గంటల వ్యవధిలోనే వారి వివరాలను ఆన్లైన్ చేసేవారు. బాధిత కుటుంబాలకు బీమా మిత్రలే ఇంటికి వెళ్లి క్లెయిమ్ మొత్తం చెల్లించేవారు.


వైసీపీ హయాంలో దరఖాస్తులు పెండింగ్

2021-22 సంవ్సతరం నుంచి అర్హులైన వారికి బీమా అందకుండా పోతోంది. సంబంధిత కుటుంబ సభ్యులు కార్యాలయాల చుట్టు ప్రదిక్షణలు చేస్తున్నారే తప్ప ప్రయోజనం ఉండటం లేదు. '2021-22 సంవత్సరానికి సంబందించి వైఎస్సార్ బీమా పెండింగ్ దరఖాస్తులు. వివరాల పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఈ ఏడాది 197 మందికి బీమా సౌకర్యం అందలేదు. జిల్లాలో 996 మంది సహజ మరణం చెందగా ఇందులో 888 మందికి బీమా అందించారు. ఇంకా 108 మందికి ఇవ్వవలసి ఉంది. అదే విధంగా ప్రమాద వశాత్తు మరణించినవారిలో 128 మందికి సంబంధించి ఆన్లైన్ చెయ్యగా ఇందులో 87 మందికి ఇంకా ఎటువంటి సాయం అందలేదు. వికలాంగు లైనవారి కింద ఇద్దరు ఆన్లైన్ చెయ్యగా వారికి ఎటువంటి సాయం అందలేదు.

మొత్తం మీద 197 మందికి బీమా అందలేదు. 2022-23 సంవత్సరానికి సంబందించి 43 మందికి బీమా అందాల్సి ఉంది. 1139 మంది బీమాకు ఎంపికవగా 1138 మందికి రాగా ముగ్గురుకు ఆగిపోయింది ప్రమాదంలో మరణించినవారి 131 మంది ఉండగా 32 మందికి బీమా రాగా 30 మందికి పెండింగ్లో ఉన్నాయి. వికలాంగులైనవారికి నలుగురుకు రావలసి ఉండగా ముగ్గురికి రాగా ఒకరికి రాలేదు. 2023-24కు సంబంధించి 397 మందికి బీమా అందాల్సి ఉంది. సహజ మరణాలు 1011 జరగ్గా అందులో 711 మందికి బీమా రాగా 300 మందికి ఇంకా బీమా అందలేదు. ప్రమాదంలో మరణించినవారిలో 144 మంది. ఉండగా 50 మందికి మంజూరైంది. 94 మందికి పెండిం గ్లో ఉంది. వీరికి కూటమి ప్రభుత్వంలో చంద్రన్న బీమా అందుతుందా, లేదా? అని ఎదురు చూస్తున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 09:38 PM