Share News

CM Chandrababu: దిద్దుబాటుకు తొలి అడుగు

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:55 AM

సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అందివచ్చిన ఓ అవకాశంగా భావిస్తున్నారు. జనంలో ప్రభుత్వం పట్ల సానుకూలత కొనసాగేలా తొలి ఏడాది నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు...

CM Chandrababu: దిద్దుబాటుకు తొలి అడుగు

  • ఒకే కార్యక్రమంతో రెండు లక్ష్యాలపై గురి

  • ఏడాది విజయాలను ప్రజలకు చెప్పడం

  • దారి తప్పిన ఎమ్మెల్యేలను గాడినపెట్టడం

  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులన్నీ నెల రోజులు జనంలోనే

  • కార్యాలయానికీ రావద్దని స్పష్టమైన ఆదేశం

  • 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే అడుగులు

  • జనంతో మమేకమయ్యేలా బాబు వ్యూహం

ఒకే బాణం.. రెండు లక్ష్యాలు. ఒకటి.. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించి చెప్పడం. రెండు.. దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలను గాడిన పెట్టడం. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమం ద్వారా ఒకేసారి ఈ రెండు లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అందివచ్చిన ఓ అవకాశంగా భావిస్తున్నారు. జనంలో ప్రభుత్వం పట్ల సానుకూలత కొనసాగేలా తొలి ఏడాది నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు నెల రోజుల పాటు జనంతో మమేకమయ్యేలా ‘తొలి అడుగు’కు రూపకల్పన చేశారు. 2019 ఎన్నికల నాటి పరిస్థితి 2029లో పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నాటి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ‘చంద్రబాబు ముద్దు.. ఎమ్మెల్యేలు వద్దు’ అని ప్రజలు భావించడంతో.. చంద్రబాబు పట్ల సానుకూలత ఉన్నా, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా టీడీపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండని పరిస్థితి. మరికొందరు సెటిల్‌మెంట్లు, నెలవారీ వసూళ్ల దందాల్లో మునిగితేలుతున్నారు. మద్యం షాపులు, రేషన్‌ షాపుల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


వీరికి సంబంధించిన నివేదికలన్నీ తెప్పించుకుంటున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వస్తున్నారు. ‘ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నా. మంచి చేస్తే అభినందిస్తా. ప్రోత్సహిస్తా. తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా. అవసరమైతే వదులుకుంటా’ అని పార్టీ సమావేశాల్లో సీఎం స్పష్టంగా చెబుతున్నారు. అయినా చాలా మంది ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా.. ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా.. ఎమ్మెల్యేల తీరుతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ప్రజాప్రతినిధులను జనంలోకి పంపడం సత్ఫలితాలను ఇస్తుందని భావించిన టీడీపీ పెద్దలు, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమాన్ని దానికి మార్గంగా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం కూటమి ప్రభుత్వం సాధించిన ఏడాది విజయాలను ప్రజలకు వివరించడమే అయినా.. దారి తప్పుతున్న పార్టీ ప్రజాప్రతినిధులను సరిదిద్దడాన్ని మరో లక్ష్యంగా చంద్రబాబు నిర్దేశించుకున్నారు. దీనికి ప్రజాప్రతినిధులను జనంబాట పట్టించడం ఒక్కటే మార్గంగా ఎంచుకున్నారు. ప్రజాప్రతినిధులు జనంలోకి వెళ్లడం ద్వారా ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తారని, తద్వారా వారిపై వ్యతిరేకత కాస్తయినా తగ్గుముఖం పడుతుందన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు బుధవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు టీడీపీకి చెందిన 20మంది మంత్రులూ పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది తొలి అడుగులో భాగస్వాములయ్యారు.


పక్కాగా పర్యవేక్షణ!

తొలి అడుగు కార్యక్రమం విషయంలో చంద్రబాబు చాలా నిక్కచ్చిగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టాలనే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించేందుకు జూన్‌ 29న పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తనతో మొదలు గ్రామస్థాయిలోని కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ నెలరోజుల పాటు ప్రజలతోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉంటే ఆదరిస్తారని లేకుంటే టాటా చెప్పేస్తారని, అందుకే నెలరోజుల పాటు ప్రతి ఒక్కరూ జనంతో మమేకమవ్వాలని ఆదేశించారు. కార్యక్రమం ప్రారంభమైన బుధవారం (జూలై 2) నుంచి ఏ రోజుకా రోజు ఎవరు, ఎక్కడ తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారో నివేదికలు తెప్పించుకుంటున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తానా సభలకు వెళ్లడంతో వారు మినహా మిగిలిన వారంతా తొలిఅడుగులో పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తానా సభలు 5వ తేదీతో ముగియనుండటంతో వెనువెంటనే వారు కూడా రాష్ట్రానికి వచ్చి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే సమాచారం పంపారు. మంత్రులు, ఎమ్మెల్యేలను అత్యవసరమైతే తప్ప పార్టీ కార్యాలయానికి కూడా రావద్దని తెలిపారు. మంత్రులకు శాఖాపరమైన సమీక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. వీటన్నిటి ద్వారా తొలి అడుగు విషయంలో తాను చాలా నిక్కచ్చిగా ఉన్నానన్న సంకేతాలను చంద్రబాబు పార్టీ శ్రేణులకు పంపుతున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 05:35 AM