Share News

Tourism : పర్యాటకంలో 20% వృద్ధి లక్ష్యం

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:14 AM

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పర్యాటక శాఖ 20 శాతం వృద్ధి రేటు సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారు. గురువారం సచివాలయంలో పర్యాటక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు.

Tourism : పర్యాటకంలో 20% వృద్ధి లక్ష్యం

హోటళ్లలో ప్రకృతి సేద్య ఆహారం ప్రమోట్‌ చేయాలి: ముఖ్యమంత్రి

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరంలో పర్యాటక శాఖ 20 శాతం వృద్ధి రేటు సాధించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారు. గురువారం సచివాలయంలో పర్యాటక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పర్యాటక, సాంస్కృతిక కార్యక్రమాలు, హోటల్‌ గదుల నిర్మాణం, పెట్టుబడులు, భూమి లీజ్‌ పాలసీ, హోంస్టేలు వంటి వాటిపై చర్చించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ‘ఏపీ హ్యపీ’ అనుకునేలా అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రూ. 1,217 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని అధికారులు వివరించారు. రూ. 45 కోట్లతో 11 టూరిజం రిసార్టులు, హోటళ్లు పునరుద్ధరించామని తెలిపారు. కేంద్రం నుంచి ప్రసాద్‌ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, ఎస్‌ఎఎ్‌ససీఐ కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్‌ దర్శన్‌ 2.0 కింద అరకు, లంబసింగి, చాలెంజ్‌ బేస్డ్‌ డెస్టినేషన్‌ డెవల్‌పమెంట్‌ కింద అహోబిలం, నాగార్జునసాగర్‌ ఎంపికైనట్లు సీఎంకు తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు 2025-26 ఏడాదికి టూరిజం ఈవెంట్స్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 37 టూరిజం ఈవెంట్స్‌లో 2 ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌, 12 మెగా ఈవెంట్స్‌ నిర్వహించనున్నట్లు వివరించగా.. సీఎం కల్పించుకుని మెగా ఈవెంట్స్‌ యూనివర్సిటీల్లో నిర్వహించాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి శిల్పారామాల్లో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నంది అవార్డుల ప్రదానంపైనా వెంటనే కసరత్తు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యాలెండర్‌ కూడా రూపొందించాలన్నారు. రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో కల్చరల్‌ ఈవెంట్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు అన్ని జిల్లాల్లోనూ, 10 జిల్లాల్లో 9 రాష్ట్ర స్థాయి ఈవెంట్స్‌ నిర్వహించనున్నారు.


గండికోట లాంటి ప్రాంతం ఎక్కడా లేదు..

జల, గిరి, వన దుర్గంగా పేరుగాంచిన గండికోట లాంటి ప్రాంతం దేశంలో ఎక్కడా లేదని, దీనికి మరింత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు. గండికోట కడప దర్గా, ఒంటిమిట్ట రామాలయం, సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు. డ్యామ్‌, అడవి, మల్లన్న దేవాలయం అన్నీ ఒకేచోట ఉండి.. పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడానికి శ్రీశైలానికి అవకాశం ఉందన్నారు. అక్కడ రోడ్ల వెడల్పునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక శాఖకు ఎంత విలువ చేసే ఆస్తులున్నాయో అంచనా వేయాలని సీఎం చెప్పారు. ఆదాయం ఎక్కువగా వచ్చేచోట ప్రోత్సాహకాలు మరింత పెంచాలన్నారు.

జలపాతాలను గుర్తించాలి

తిరుపతి, విశాఖలో జూ పార్కులు ఉన్నట్లు ఇప్పటికి చాలామందికి తెలియడం లేదని, వాటికి ప్రచారం కల్పించి సందర్శకులను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏయే ప్రాంతాల్లో జలాపాతాలున్నాయో గుర్తించి వాటికీ ప్రచారం కల్పించాలన్నారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతిని పర్యాటకంలో యాంకర్‌ హబ్‌లుగా అభివృద్ధి చేయాలన్నారు. కోనసీమలో హౌస్‌ బోట్స్‌ ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్‌ను మరింత అభివృద్ధి చేయాలన్నారు. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్‌ సిటీలుగా తీర్చిదిద్దాలని, ఈ ప్రక్రియ 90రోజుల్లో పూర్తి చేయాలని, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మరో నాలుగు నెలల్లో ఏపీ హ్యాపీ స్టేట్‌ అని పర్యాటకులు అనుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్‌, ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 06:14 AM