AP CM Chandrababu: రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తా
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:42 AM
రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకువస్తానని, పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చంద్రబాబు తెలిపారు ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు

పేదరికం లేని సమాజమే లక్ష్యం
ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తా
ఆధ్యాత్మిక టూరిజం హబ్‌గా అభివృద్ధి
తిరుమల తరహాలో అన్నప్రసాదాలు: చంద్రబాబు
రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొస్తానని, ఆ స్వామి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని తెస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని, తిరుమల తరహాలో ఇక్కడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. యుగపురుషుడైన శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యవాసం చేశారని, ఆయన నీతి నిజాయితీ మనందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన పాలనను తీసుకురావడమంటే పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దడం, సాటి మనిషిని గౌరవించడం, అందరూ సమానమన్న భావన ఏర్పడటమేనని తెలిపారు. పారిశ్రామికవేత్త పెన్నా ప్రతాప్ రెడ్డి కోదండరామాలయానికి రూ.6.50 కోట్ల బంగారు, వజ్ర కిరీటాలు బహుకరించడం అభినందనీయని కొనియాడారు. ఇలాంటివారు ముందుకు వచ్చి ఆలయాలను అభివృద్ధి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 30 లక్షల పేద కుటుంబాలు ఉండగా 10 లక్షల కుటుంబాలు ఆర్థికంగా బాగున్నవారు ఉన్నారని చెప్పారు. పేద కుటుంబాలను అభ్యున్నతిలోకి తీసుకురావడమే రఽపధాన సంకల్పంగా పేర్కొన్నారు. తిరుమలో ఎన్టీఆర్ అన్న ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించారని, నేడు ఆ ట్రస్టు రూ.2,200 కోట్ల డిపాజిట్లకు చేరుకొని, రోజూ లక్షమందికి అన్నప్రసాదం అందిస్తోందని వివరించారు. టీటీడీ బోర్డు వెంటనే సమావేశమై ఒంటిమిట్టలో అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక్కడ మిగిలిపోయిన అభివృద్ధి పనులన్ని వెంటనే పూర్తిచేస్తామని తెలిపారు. తిరుమల, ఒంటిమిట్ట, తాళ్లపాకను కలుపుతూ ఆధ్యాత్మిక టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవాలయాలు వారసత్వ సంపదకు నిలయాలుగా అభివర్ణించారు. దేవాలయాల వల్లే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు వెంటనే ఒంటిమిట్టలో అన్న ప్రసాదాలను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రులు సవిత, రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీలు సీఎం రమేశ్, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవోతో పాటు ఉమ్మడి కడప జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.
For AndhraPradesh News And Telugu News