Share News

CM Chandrababu Naidu: ఎవర్నీ వదలం

ABN , Publish Date - May 29 , 2025 | 04:52 AM

చంద్రబాబు వేరే చేసిన తప్పులపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాయలసీమకు ప్రధాన ప్రాజెక్టులు, పరిశ్రమలు, నీటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

CM Chandrababu Naidu: ఎవర్నీ వదలం

ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం..

భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాం: బాబు

తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే: సీఎం

చండశాసనుడిగా వ్యవహరిస్తా.. టీడీపీ హయాంలోనే శాంతిభద్రతలు

నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని రూపుమాపాం

జగన్‌ జమానాలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు.. నేరాలను వ్యవస్థీకృతం చేశారు

గ్రామస్థాయి పరిశ్రమగా గంజాయి సాగు.. గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తే ఆస్తులు జప్తు

సీమను సుభిక్షం చేస్తా.. ఈ ఏడాది రూ.3,800 కోట్లతో సీమ ప్రాజెక్టుల అభివృద్ధి

10 రోజుల్లో కడప ఉక్కుకు శంకుస్థాపన.. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ

బనకచర్ల అనుసంధానంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ నీరు

సముద్రంలోకి పోయే నీరే వాడుకుంటున్నాం.. బీఆర్‌ఎస్‌వి లేనిపోని విమర్శలు

తెలంగాణ ప్రాజెక్టులు కడితే మేం అభ్యంతరం చెప్పలేదు

2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తి.. ఫైనాన్షియల్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర

అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌.. క్లీన్‌, గ్రీన్‌, ఎనర్జీ హబ్‌గా రాష్ట్రం

రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల మందికి ఉద్యోగాలు

కరెంటు చార్జీలు పెంచం.. మహానాడు 2వ రోజు ముగింపు ప్రసంగం

మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థి పార్టీ అనేక పన్నాగాలు పన్నుతోంది. తెలుగుదేశం ముసుగేసుకుని తప్పులు చేస్తే ముసుగు తొలగిస్తాం. ఏం చేయాలో అది చేస్తాం.

- చంద్రబాబు

(మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)

తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులేనని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. టీడీపీ హయాంలోనే శాంతిభద్రతలు నియంత్రణలో ఉంటాయన్నారు. నక్సలిజం.. ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని రూపుమాపిన పార్టీ తెలుగుదేశం అని స్పష్టంచేశారు. ప్రపంచంలో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తిసామర్థ్యాలు ఒక్క టీడీపీకే ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కడప మహానాడులో రెండో రోజు బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదన్నారు. గంజాయి, డ్రగ్స్‌ రాజ్యమేలాయని.. ఏజెన్సీలో గంజాయి సాగు గ్రామస్థాయి పరిశ్రమగా మారిందని చెప్పారు. నేరాలను వ్యవస్థీకృతంగా మార్చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలోని అధినేతే సొంత బాబాయిని చంపి ఆ నిందను తనపై వేశారన్నారు. ‘శాంతిభద్రతలను కాపాడే బాధ్యత మన కూటమి ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. శాంతిభద్రతలను ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు, ఇది నా పార్టీ కుటుంబసభ్యులకు నేను చేస్తున్న విజ్ఞప్తి. తప్పుచేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదు.

ghk.jpg

వారి పట్ల చండశాసనుడిలా వ్యవహరిస్తా. గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తే వారి ఆస్తులను జప్తు చేస్తాం. అలా జప్తు చేసిన ఆస్తులను బాధితుల కోసం వినియోగిస్తాం’ అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే..


ఎడారి సీమ కానివ్వను..

రాయలసీమ సుభిక్షానికి ప్రాజెక్టులు చేపట్టాం. సీమను కరువుసీమగా, ఎడారి సీమగా కానివ్వనని హామీ ఇస్తున్నా. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్‌. నేను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింత ముందుకు తీసుకెళ్లాం. ఈ ఏడాది రూ.3,800 కోట్లతో రాయలసీమ నీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. పోలవరం తర్వాత ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టు హంద్రీ-నీవా. ఉద్యాన పంటలతో ఇప్పుడు అనంతపురం సంపదలో ముందంజలో ఉందంటే దానికి కారణం టీడీపీయే. వెలిగొండ ప్రాజెక్టును కూడా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయబోతున్నాం. 2027 డిసెంబరు నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి రైతుల రుణం తీర్చుకోవడమే నా లక్ష్యం. సీమలో రక్షణ పరిశ్రమల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ పెడతాం. సీమను హార్టీకల్చర్‌ హబ్‌గా, హైటెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతాం. తిరుమల, శ్రీశైలంలాంటి దివ్యక్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. 10 రోజుల్లో కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాం. 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపడతాం. జిందాల్‌ సంస్థ నిర్మించే ఈ స్టీల్‌ ప్లాంట్‌తో 3వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనికి శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తా. వంశధార నుంచి పెన్నా వరకు నదులన్నీ అనుసంధానించాలన్నదే నా లక్ష్యం. తద్వారా తెలుగు నేలకు జలహారతి ఇచ్చి, ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటాం.

ghkl.jpg

రెండు రాష్ట్రాలూ నాకు సమానమే

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరిచ్చేలా కార్యాచరణ రూపొందించాం. పోలవరం నుంచి కృష్ణానదికి.. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తాం. ఈ అనుసంధానం పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకూ లాభమే. బీఆర్‌ఎస్‌ దీనిపై లేనిపోని విమర్శలు చేస్తోంది. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే మేమెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నాకు సమానమే. దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దింది కూడా టీడీపీయే.


అనకాపల్లిలో మరో ఉక్కునగరం

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, నియోజకవర్గాలు అభివృద్ధి కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరాంధ్రను ఫైనాన్షియల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా చేశాం. అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ పెడుతోంది. అక్కడ మరో ఉక్కు నగరం తయారవుతుంది. విశాఖలో రైల్వే జోన్‌, ఫార్మాసిటీ, ఫార్మా జోన్‌ తయారవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం, మెట్రోలాంటి ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. రాయలసీమను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపే బాధ్యత టీడీపీదే. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో రతన్‌టాటా ఇన్నొవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 43 ఏళ్లుగా ఆదరిస్తున్న ఆంధ్ర ప్రజల రుణం తీర్చుకోవాలనే రాత్రీపగలు కష్టపడి పనిచేస్తున్నాను. భవిష్యత్‌ అంతా టూరిజానిదే. రాబోయే ఇజం టూరిజమేనని గతంలోనే చెప్పా. గండికోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకే ప్రయత్నాలు చేస్తున్నాం. పోలవరానికి రూ.12 వేల కోట్లు, రైల్వే జోన్‌ సాధించాం. అమరావతిని ప్రజారాజధానిగా నిర్మించేందుకు ప్రాజెక్టులను పట్టాలెక్కించాం. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ మూడో విడత డబ్బులు కూడా మహిళల ఖాతాల్లో ముందుగానే వేస్తాం. 2014నాటికి 22 మిలియన్‌ యూనిట్ల కరెంటు కొరత ఉంటే.. సంస్కరణలు తెచ్చి మిగులు రాష్ట్రంగా మార్చాం. 2019లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలన్నీ రద్దు చేసి వ్యవస్థను వైసీపీ సర్వనాశనం చేసింది. విద్యుత్‌ కొరత లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఏపీని క్లీన్‌, గ్రీన్‌, ఎనర్జీ హబ్‌గా రూపొందిస్తున్నాం. కరెంటు చార్జీలు పెంచబోమని పునరుద్ఘాటిస్తున్నా. ప్రతి ఇంటిపైనా సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు సౌర ప్యానెళ్లు ఉచితంగా ఇస్తాం. పీఎం కుసుం కింద వ్యవసాయ పంపుసెట్ల వద్ద సౌర ప్యానెళ్లు పెట్టుకోవాలి. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం 75 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలంతా ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు పెట్టుకోవాలి.


హెచ్‌ఏఎల్‌ తరలింపుపై సీఎం స్పష్టత

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను ఆంధ్రకు తరలించాల్సిందిగా తాను కేంద్రాన్ని కోరినట్లు వచ్చిన వార్తలపై మహానాడులో సీఎం స్పష్టత ఇచ్చారు. ‘ఏరోస్పేస్‌ పరిశ్రమకు అనువైన ప్రాంతం అనంతపురం జిల్లా లేపాక్షి. కేంద్రాన్ని అదే అడిగాను. కానీ కర్ణాటకలోని కొందరు నేనేదో హెచ్‌ఏఎల్‌ను తరలించాలని అడిగినట్లు మాట్లాడున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న సంస్థను వేరే తరలించమని నేనెప్పుడూ కోరను. అలా కోరి చెడ్డ పేరు తెచ్చుకోను’ అని తేల్చిచెప్పారు.

పోలవరాన్ని 20ఏళ్లు వెనక్కి నెట్టారు

‘నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందన్న నానుడి మన సీఎంకు బాగా తెలుసు. అందుకే వీలైనంత వరకు సాగునీరు, తాగునీరు కొరత లేకుండా చూడాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. 2014-19 వరకు ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం రూ.72 వేల కోట్లు కేటాయించింది. కానీ 2019-24లో ఈ రంగానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది రూ.32వేల కోట్లు మాత్రమే. పోలవరం ప్రాజెక్టును 20ఏళ్లు వెనక్కి నెట్టేశారు. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తిచేసి ఉత్తరాంధ్రకు, రాయలసీమకు నీటిని మళ్లిస్తాం.’

- మంత్రి నిమ్మల రామానాయుడు


(అంశం: సమగ్ర నీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి)

రివర్స్‌ టెండరింగ్‌తో ప్రశ్నార్థకం

‘పోలవరం ప్రాజెక్టును రివర్స్‌ టెండరింగ్‌తో గత పాలకులు నాశనం చేశారు. 2014-19 కాలంలో చంద్రబాబు హయాంలో 72 శాతం పనులు పూర్యయ్యాయి. ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. గత పాలకుల్లాగా జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసే విధానానికి స్వస్తిపలికి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు కృషి చేశారు.’

- ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి

(అంశం: సమగ్ర నీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి)

వచ్చే మహానాడు పులివెందులలో...

‘దివంగత ఎన్టీఆర్‌ టీడీపీ హయాంలోనే రాయలసీమలో తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు నాంది పలికారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ హయాంలో రూ.2వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు నీళ్లిచ్చి కాపాడింది, గండికోట నుంచి పులివెందులకు నీరిచ్చిన ఘనత చంద్రబాబుదే. కడప జిల్లాకు జగన్‌ మోసం తప్ప ఏమీ చేసింది లేదు. వచ్చే మహానాడు పులివెందులలో నిర్వహిస్తాం... మీరు సిద్ధమేనా?’

- ఆర్‌.శ్రీనివాసరెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు (అంశం: సమగ్ర నీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి)

ఐదేళ్ల విధ్వంసాన్ని ఏడాదిలో పూడ్చిన చంద్రబాబు

20ఏళ్ల ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించడం సీఎం చంద్రబాబుకే సాధ్యం. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌ పోయిందనే బాధను పక్కనపెడితే ఆయన మనతో ఉన్నారని, ఆయన పాలనలో ఏపీలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక హైదరాబాద్‌ను చేస్తారనే నమ్మకం ఉంది. కేంద్రం సహకారంతో మౌలిక సదుపాయాల కల్పన చురుగ్గా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.130కోట్లతో ప్రతి మండలానికి రోడ్లు వేశాం. గత వైసీపీ పాలనలో ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే పూడ్చారు.’

- ఎమ్మెల్యే గౌతు శిరీష (అంశం: మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం)

Updated Date - May 30 , 2025 | 02:56 PM