CM Chandrababu Naidu: వన్ విజన్.. వన్ డైరెక్షన్
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:12 AM
వన్ విజన్- వన్ డైరెక్షన్’ అనేదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని నిర్దేశించారు.
ఇదే ప్రభుత్వ విధానం: చంద్రబాబు
ప్రతి నియోజకవర్గానికీ విజన్ ప్లాన్
సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలి
వీటిని మరింత సమర్థంగా వినియోగించాలి
ఆన్‌లైన్, వాట్సాప్ సేవలు విస్తృతం కావాలి
ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలి
ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యం చేయవద్దు
సుపరిపాలన అందిద్దాం.. శాఖలకు రేటింగ్ ఇస్తాం
మంత్రుల పనితీరు మెరుగుపడాలి
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
‘డేటా ఆధారిత పాలన’పై సదస్సులో సీఎం నిర్దేశం
మనం ఉపయోగించుకున్నంతగా టెక్నాలజీని ఏ రాష్ట్రమూ ఉపయోగించడం లేదు. సింగిల్ టీమ్, సింగిల్ థీమ్, సింగిల్ అప్రోచ్‌తో పనిచేద్దాం. యంత్రాంగం ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలి. అంతా బాధ్యతగా పని చేయాల్సిందే. నిర్లక్ష్యానికి, అలసత్వానికి అవకాశమివ్వొద్దు.
- సీఎం చంద్రబాబు
ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడిలా మిగిలితే సమాజానికి అన్యాయం చేస్తున్నట్లే!
- సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘వన్ విజన్- వన్ డైరెక్షన్’ అనేదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని నిర్దేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ‘డేటా ఆధారిత పాలన’పై సదస్సు జరిగింది. దీనికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరవగా.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి.. సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి.. డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఎలా మెరుగైన సేవలు అందించవచ్చనే అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ హోదాలో ఉన్నా పౌరులకు సంతృప్తి కల్పించేలా అందరం పని చేయాలన్నారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని, పౌరులకు సుపరిపాలన అందించాలని.. ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇందుకు అనుగుణంగా విజన్ ప్రణాళికలు రూపొందించామన్నారు. నెల, త్రైమాసికాల వారీ లక్ష్యాలు పెట్టుకుని ఫలితాలు సాధించాలని సూచించారు. ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ డేటా ఆధారిత పాలనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
విజన్ ప్లాన్ అమలుకు టాస్క్‌ఫోర్స్
2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధన కోసం గ్రామ/వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి. ఈ విభాగాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగా నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. పౌరుల డేటా అంతా క్రోడీకరించాం. అంగన్వాడీల స్థాయి నుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ వ్యవస్థ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ ఒక్క చోటే క్రోడీకరించి, నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. డేటా ఆధారిత పాలన ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. సంక్షేమానికి, సుపరిపాలనకు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నాం. నిధుల వినియోగం సమర్థంగా జరగాలి.
ఆఫీసుల చుట్టూ తిరగకుండా..
గతంలో కులం, స్థానికత, ఆదాయం.. ఇలా వేర్వేరు సర్టిఫికెట్ల కోసం పది రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవలసి వచ్చేది. ఇక ఈ పరిస్థితి మారాలి. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నప్పుడు ప్రజలను మళ్లీ ఆఫీసులకు రప్పించడం ఎందుకు? కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన డిజి లాకర్ వ్యవస్థను సమర్థంగా వినియోగించాలి.
తప్పిదాలు జరక్కుండా చూసుకోవాలి
ఇటీవల కర్నూలులో ప్రమాదం జరిగిన బస్సు యజమానిది ఒక రాష్ట్రం. బస్సును ఆల్ర్టేషన్ చేసింది మరో రాష్ట్రం.. నడిపేది ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి. ఈ విషయంలో ఎవరు బాధ్యత తీసుకోవాలనే ప్రశ్న వస్తోంది. శ్రీకాకుళంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. ఒక సంఘటన జరిగిన తర్వాత తప్పులు దిద్దుకోవాల్సి వస్తోంది. ఇలాంటి ఘటనల విషయంలో నిర్దిష్ట ప్రామాణికాలు (ఎస్‌వోపీ) రూపొందించుకుని, మళ్లీ అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. గత పాలకులు అన్ని శాఖల పనితీరునూ దెబ్బతీశారు. ఎక్సైజ్ విభాగంలో తీవ్రమైన అవకతవకలు జరిగితే.. వాటిని సరిచేస్తుంటే.. మళ్లీ మనపై నిందలేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి అపోహలు, ఆరోపణలు గుప్పించే ప్రయత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. భూ సంబంధ వ్యవహారాల్లో లిటిగేషన్లు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం కోర్టుకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. ఏఐ వాడితే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చు. టెక్నాలజీతో ఖర్చులు కూడా తగ్గించవచ్చు.
తుఫాన్ నష్టాలను తగ్గించాం..
గడచిన 16 నెలల్లో టెక్నాలజీని అనుసంధానం చేసుకుని, ఒక సమర్థ విధానం తయారు చేసుకున్నాం. ఇటీవల మొంథా తుఫాన్ సందర్భంగా టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి, ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించగలిగాం. ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం.
మీ పనితీరు బాగోలేదు!
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర పూర్తవుతోంది. కొన్ని శాఖల పనితీరు బాగానే ఉన్నా.. మిగిలిన శాఖల పనితీరు మెరుగుపరచుకోవాలి. ప్రతిరోజూ పనిపై దృష్టి పెట్టాలి. అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాలి. ప్రతి సమావేశంలోనూ మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లాలని నేను చెబుతున్నా, చాలా మంది నుంచి స్పందన లేదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక కూడా మన పనితీరు మెరుగుపడకపోతే అది మన తప్పే అవుతుంది. కొందరు మంత్రుల వద్ద ఫైళ్లు జీరో పెండెన్సీ ఉంటే మరికొందరి వద్ద ఐదారు రోజుల వరకు పెండెన్సీ చూపిస్తోంది. ఇది సరికాదు. ప్రజల్లో సంతృప్త స్థాయి పెరిగేందుకు కొన్ని విభాగాలు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. శానిటేషన్ విషయంలో ఆర్టీసీ కొంత వెనుకబడిఉంది. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖలు మరింత మెరుగవ్వాలి. రిజిస్ర్టేషన్ విభాగం సేవల్లో సంతృప్తి స్థాయి 62-70 శాతానికి చేరింది.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం