Share News

CM Chandrababu Naidu: మీ పెట్టుబడులకు మాదీ పూచీ

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:23 AM

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ ఎంపికగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులకు అత్యంత భద్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు.

CM Chandrababu Naidu: మీ పెట్టుబడులకు మాదీ పూచీ

  • ఆంధ్రా-సింగపూర్‌ బిజినెస్‌ ఫోరం భేటీలో చంద్రబాబు భరోసా

  • పెట్టుబడి అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

  • నవంబరులో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి

  • పెట్టుబడులే కాదు.. పేదలకు సాయమూ చేయండి

  • పేద-ధనిక అంతరం తగ్గించడానికే పీ-4

  • త్వరలో ఏపీ-సింగపూర్‌ స్టార్టప్‌ ఫెస్టివల్‌

  • రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు

  • నైపుణ్యమున్న వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తాం

  • ఏపీలో 6 పోర్టులు, 7ఎయిర్‌పోర్టులు

  • త్వరలో అందుబాటులోకి మరో 4 రేవులు,ఇంకో 9 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు: సీఎం

కారిడార్లు, క్లస్టర్లు, పార్కుల విస్తరణ ద్వారా పారిశ్రామిక పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు కల్పిస్తున్నాం. విశాఖ-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు-చెన్నై కారిడార్లు పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయి. త్వరలో ఆంధ్ర-సింగపూర్‌ స్టార్టప్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తాం.

- చంద్రబాబు

అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ ఎంపికగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులకు అత్యంత భద్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు సోమవారం ఆయన ఏపీ-సింగపూర్‌ బిజినెస్‌ ఫోరం తరఫున నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. దీనికి సింగపూర్‌ కంపెనీలతోపాటు ఏపీ నుంచి కూడా పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని సింగపూర్‌ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలు. స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలపై ఈ సందర్భంగా ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌ కోసం 2014లో సింగపూర్‌ వచ్చానని.. సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఇచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో ఏపీతో సింగపూర్‌ ప్రభుత్వ సంబంధాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన పర్యటనతో సత్సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్‌ అవినీతిరహిత దేశమని..


అందుకే ఈ దేశమంటే తనకిష్టమని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో ఈ దేశ ప్రభుత్వానిది అత్యత్తమ మోడల్‌ అని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ సమీపంలో సింగపూర్‌ టౌన్‌షిప్ నిర్మించామని గుర్తు చేసుకున్నారు. సింగపూర్‌ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. విశాఖ సదస్సుకు ప్రతిపాదనలతో హాజరు కావాలని కోరారు. అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుందామన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..

రవాణా, సర్క్యులర్‌ ఎకానమీ అమలు..

2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలనే లక్ష్యంతో ప్రజల ఆర్థిక పురోగతి కోసం పని చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దుగా అవకాశాలున్నాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో పాటు వాటికి భద్రతా ఉంటుంది. అమరావతి, విశాఖలో లాజిస్టిక్‌ కారిడార్లు ఏర్పాటవుతున్నాయి. పెట్టుబడిదారులకు అవసరమైన నైపుణ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. తక్కువ వ్యయంతో రవాణా, సర్క్యులర్‌ ఎకానమీని అమలు చేయడం ద్వారా సుస్థిర భవిష్యత్‌ దిశగా అడుగులు వేస్తున్నాం. ఫ్యూచర్‌ టెక్నాలజీ కోసం అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. సమీప భవిష్యత్‌లో సంప్రదాయ విద్యుత్‌ వినియోగం నుంచి గ్రీన్‌ ఎనర్జీకి మారిపోతున్నాం. జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌లో భాగంగా.. రాష్ట్రం నుంచే మూడో వంతు గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పారిశ్రామిక అభివృద్ధి కోసం 24 ఽథీమాటిక్‌ విధానాలను ప్రకటించాం. ఎలాట్రానిక్ మొబిలిటీ, వేస్ట్‌ రీసైక్లింగ్‌, ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులు, ఏరోస్పేస్‌, రక్షణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంఎ్‌సఎంఈలు, మారిటైమ్‌ బోర్డు, మైనర్‌ మినరల్‌, స్పోర్ట్స్‌, టెక్స్‌టైల్‌ విధానాలు తెచ్చాం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్‌, ఇన్నోవేషన్‌ పాలసీలను అమలు చేస్తున్నాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. రాష్ట్రం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. ప్రస్తుతం ఆరు ఆపరేషనల్‌ పోర్టులు అందుబాటులో ఉన్నాయి. మరో నాలుగు రేవులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మారిటైమ్‌ కార్గో రంగంలో అపార అవకాశాలున్నాయి. మా ద్వారా పొరుగు రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌కు చాన్సుంది.


ఏడు విమానాశ్రయాలు ఉన్నాయి. మరో 9చోట్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. విశాఖలో ప్రభుత్వ స్టీల్‌ ప్లాంటుకు సమీపంలోనే ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపిస్తున్నాం. విశాఖలో అదానీ గ్రూప్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. గూగుల్‌ కూడా ఇక్కడే డేటా సెంటర్‌ పెట్టబోతోంది. భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌, బెంగళూరు, అమరావతి, చెన్నై నగరాల్లోని ఐదు కోట్ల మందిని కలిపేలా త్వరలో బుల్లెట్‌ ట్రైన్‌ రానుంది. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ కోసం ప్రత్యేక హబ్‌లు ఏర్పాటు చేయనున్నాం. సంపద సృష్టించడమే నా ధ్యేయం.


నేడు మూడోరోజు సీఎం షెడ్యూల్‌..

  • క్యారియర్‌, విల్మర్‌, టీవీఎస్‌, మురాటా ప్రతినిధులతో చర్చలు..

  • సింగపూర్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సమావేశం.. యూట్యూబ్‌ అకాడమీతో ఒప్పందం.

  • ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్‌, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక రంగాల్లో పెట్లుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో భేటీ.

  • గూగుల్‌ క్లౌడ్‌ ప్రతినిధులతోనూ సమావేశం. బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ భేటీకి హాజరు.

అప్పుడు పీ-3, ఇప్పుడు పీ-4

గతంలో పీ-3 అమలు చేశాం. ఇప్పుడు పీ-4(పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానం తీసుకొచ్చాం. పేదలు-ధనికుల మద్య అంతరం తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్య. పేదలకు చేయూతనివ్వడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. పెట్టుబడులే కాదు.. పేదలకు సాయం చేయాలని కూడా ఇదే వేదికగా కోరుతున్నాను.

Updated Date - Jul 29 , 2025 | 08:09 AM