TDP: కార్యకర్తే అధినేత
ABN , Publish Date - May 28 , 2025 | 05:24 AM
తెలుగుదేశం పార్టీ మహానాడు కడప జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాల్లో ‘కార్యకర్తే అధినేత’ అంశంపై చర్చించి ఆమోదం పొందింది.
కడప వేదికగా ‘మహా’సంరంభం
‘నా తెలుగు కుటుంబం’పైనే చర్చంతా
తొలి రోజు 5 తీర్మానాలు ఆమోదం
లోకేశ్ ప్రతిపాదిత 6 శాసనాల్లో భాగం
ప్రముఖంగా ప్రస్తావించిన చంద్రబాబు
రాష్ట్ర చరిత్రను మారుస్తాయని కితాబు
వీటికోసం పార్టీ నియమావళికి సవరణ
తెలుగుదేశం పార్టీ అత్యున్నత వేడుక మహానాడు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. కడప జిల్లా సీకే దిన్నె మండలం పబ్బాపురంలో ఉదయం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభోపన్యాసంతో తొలి రోజు కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా కార్యకర్తకు పెద్దపీట వేశారు. పార్టీ పటిష్ఠానికి ఆయన ‘నా తెలుగు కుటుంబం’ పేరుతో ఆరు శాసనాలను మొదటి రోజు మహానాడులో ప్రతిపాదించారు. వాటిలో ‘కార్యకర్తే అధినేత’ అనే ప్రతిపాదనపై తొలిచర్చ జరిగింది. చంద్రబాబు కూడా తన ప్రసంగంలో లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవి రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయన్నారు. ‘ఈ మహానాడు వేదికగా చెబుతున్నా.. ప్రతి కార్యకర్తా గర్వపడేలా పాలన అందిస్తాం. గ్రామాల్లో మీరు మీసం మెలేసేలా చేస్తాం. కార్యకర్తే పార్టీకి ప్రాణం.. ఆయుఽ దం కూడా వారే. వారి త్యాగాలు వృధా కానివ్వం’ అన్నారు.
వేదికపై కార్యకర్తల ప్రసంగాలు..
గతంలో ఏ మహానాడులో లేని విధంగా రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన కార్యకర్తలకు వేదికపై ప్రసంగించే అవకాశం కల్పించారు. ముందుగా పాలకొల్లు నియోజకవర్గం క్లస్టర్ ఇన్‌చార్జి పిచ్చేటి వెంకటనర్సింహ మహానాడు వేదికపై నుంచి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలను ఎలా తీర్చిదిద్దుతున్నామో వివరించారు. అనంతరం మరికొందరు కార్యకర్తలు మాట్లాడారు. కాగా, మహానాడుకు రెండు రాష్ట్రాల నుంచీ టీడీపీ కార్యకర్తలు, నాయకులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 23వేల మంది పార్టీ ప్రతినిధులకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు. వీరంతా తొలిరోజు ప్రతినిధుల నమోదు కేంద్రం వద్ద నమోదు చేయించుకున్నారు. మరో 10 వేల పైచిలుకు కార్యకర్తలు తరలివచ్చారు. వీరందరితో మహానాడు ప్రాంగణం కిటకిటలాడింది. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది.
వైసీపీ హయాంలో 1,030 మంది కార్యకర్తల మృతి: సోమిశెట్టి
కేశవ్ ప్రారంభోపన్యాసం తర్వాత టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 1,030 మంది టీడీపీ కార్యకర్తలు మృతిచెందారని వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ‘ఆపరేషన్ సింధూర్’లో అసువులు బాసిన వీరజవాన్లకూ సంతాపం తెలుపుతూ నేతలు మౌనం పాటించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేసే అవకాశముంది. బుధవారం సాయంత్రం ఫలితం ప్రకటిస్తారు. మహానాడు తొలి రోజు ఐదు అంశాలపై తీర్మానాలు చేశారు. అయితే ఇవన్నీ లోకేశ్ లోకేశ్ ప్రతిపాదించిన ‘నా తెలుగు కుటుంబం’లోని 6 శాసనాల్లో భాగం కావడం గమనార్హం. కార్యకర్తే అధినేత, యువగళం, సామాజిక న్యాయం-పేదల ప్రగతి, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా.. అన్న ఐదు అంశాలపై చర్చించి ఆమోదించారు. అలాగే ఈ శాసనాలను పార్టీ నియమావళిలో భాగం చేస్తూ నియమావళిలో సవరణలు చేశారు.
ముఖ్య నేతలతో బాబు భేటీ తొలిరోజు మహానాడు ముగిసిన తర్వాత.. కార్యక్రమం జరిగిన తీరుపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. మొదటి రోజు బాగా జరిగిందని ప్రశంసించారు. తొలి రోజు పార్టీకి రూ.22.28 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు. (మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి) పక్కాగా సమయపాలన మహానాడు తొలి రోజు నేతలంతా సమయపాలన పక్కాగా పాటించారు. ఉదయం 8.30కి ప్రతినిధుల నమోదు మొదలు.. వేదికపై నేతల ప్రసంగాలు.. చివరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సైతం నిర్ణీత వ్యవఽధిలోనే ముగించారు. చివరిగా సాయంత్రం 6 గంటలకు తొలి రోజు కార్యక్రమాన్ని ముగించాల్సి ఉండగా 20 నిమిషాలు ఆలస్యమైంది. సభావేదికపై చంద్రబాబు దీనిని ప్రస్తావించారు. ఈ ఆలస్యానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కారణమని సరదాగా వ్యాఖ్యానించారు. రేపటి నుంచి ఆలస్యం కాకూడదని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News