Chandrababu: హెచ్‌ఎంపీవీపై అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:27 AM
రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదుకాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదుకాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ)పై రెండు రోజులుగా వ్యాప్తి చెందుతున్న వార్తల దృష్ట్యా... ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన టెలికాన్ఫర్స్ నిర్వహించారు. కర్ణాటక, గుజరాత్‌ల్లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించేందుకు వైద్య నిపుణులతో ట్రాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తించిన 10 వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే జర్మనీ నుంచి 3000 కిట్లు కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. 4.50 లక్షల ఎన్95 మాస్క్‌లు, 3.52 లక్షల పీపీటీ కిట్లు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్ మాస్క్‌లు, అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే మూడు నెలలకు సరిపడా శానిటైజర్లు, మాస్కులు సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు. చికిత్సకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ బోధన, జిల్లా ఆస్పత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా ఉంచాలన్నారు. కాగా, ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు విశాఖపట్నం వెళ్లిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అక్కడనుంచే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.