Lord Srinivasa Kalyanam : కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:51 AM
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కనులపండువగా జరిగింది.

ఆధ్యాత్మిక నగరి తిరుమలను తలపించిన వెంకటపాలెం
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, టీటీడీ చైర్మన్, ఈవో
తిరుమల ఆలయం నుంచి తెచ్చిన 50 వేల చిన్న లడ్డూలు పంపిణీ
గుంటూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కనులపండువగా జరిగింది. రాజధాని పరిధి వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో తొలిసారిగా శ్రీనివాసుడి కల్యాణాన్ని శనివారం సాయంత్రం టీటీడీ వైభవోపేతంగా నిర్వహించింది. విద్యుత్ కాంతుల ధగధగలతో వెలుగులీనుతున్న ప్రాంగణంలో కల్యాణ మహోత్సవాన్ని చూస్తూ భక్తజన సందోహం పులకరించిపోయింది. అన్నమయ్య సంకీర్తనలు, వేద మంత్రోచ్ఛరణలతో రాజధాని ఆధ్యాత్మిక నగరిని తలపించింది. కల్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు సంప్రదాయబద్ధంగా పట్టు పంచె ధరించి సతీ సమేతంగా హాజరయ్యారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ కంటే 17నిమిషాలు ముందుగానే, సాయంత్రం 5:43 గంటలకే వెంకటపాలెంలోని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంత్రులు, టీటీడీ సిబ్బందితో కలిసి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు, గవర్నర్ తిరునామధారణ చేయించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ ముఖ్యమంత్రి దంపతులు ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు పట్టువస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. పెద్ద జీయర్ స్వామి, చిన జీయర్ స్వామి, అహోబిల మఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, శివస్వామి తదితరులు హాజరయ్యారు. పెద్ద జీయర్ స్వామి ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు.
శోభాయమానంగా వేదిక
శ్రీవారి కల్యాణ వేదిక విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా విరాజిల్లింది. ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్వీబీసీ ప్రసారాలు, ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా 18 పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30వేల కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలతో చేసిన అలంకరణలు చూసి వచ్చినవారంతా ముగ్ధులయ్యారు. చెన్నైకి చెందిన నిత్యశ్రీ మహదేవన్, ప్రియా సోదరిమణులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలతో భక్తులు తన్మయత్వం చెందారు. గ్యాలరీల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తకం, ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఉన్న బ్యాగ్‌లను దాదాపు 1,500 మంది శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన 50 వేల చిన్న లడ్డూలను భక్తులకు అందించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ పౌండేషన్ సంస్థ 40వేల పులిహోర ప్యాకెట్లు, 40వేల పెరుగన్నం, 40వేల రవ్వకేసరి, 40వేల స్వీటు ప్యాకెట్లను పంపిణీ చేసింది. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.