Share News

Chandrababu: మనం మనం కొట్టుకుంటే లాభమేంటి

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:45 AM

బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గోదావరిలో నీళ్లు ఉన్నాయి. వాటిని తెలంగాణ, ఏపీ రెండూ ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ వాళ్లను పైన ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోమనండి. మనం వారు దిగువకు వదిలేసిన నీటినే....

Chandrababu: మనం మనం కొట్టుకుంటే లాభమేంటి

  • తెలంగాణ కానీ, ఆంధ్రా కానీ అంతా తెలుగువారే

  • గొడవ పడటమంటే ప్రజల్ని మోసం చేయడమే

  • సముద్రంలో కలిసే నీటివాడకంపై వివాదమేంటి?

  • కాళేశ్వరం కట్టుకున్నప్పుడు నేను అడ్డుచెప్పలేదు

  • ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుందాం

  • చట్టబద్ధత కావాలంటే కేంద్రం వద్ద కూర్చుందామని చెబుతున్నా

  • బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు

గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3 వేల టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది. తెలంగాణ ఎంత వాడుకున్నా 100 టీఎంసీలు వాడుకోగలదు. మనం ఎంత వాడుకున్నా మరో 100 టీఎంసీలు వాడుకోగలం. దీనిపై రాద్ధాంతం ఎందుకు?

- సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గోదావరిలో నీళ్లు ఉన్నాయి. వాటిని తెలంగాణ, ఏపీ రెండూ ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ వాళ్లను పైన ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోమనండి. మనం వారు దిగువకు వదిలేసిన నీటినే ఉపయోగించుకుంటున్నాం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. దీనిపై మనం మనం కొట్టుకుంటే లాభం లేదు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎవరికి కేటాయించిన నీటిని వారు వాడుకుందామని, కొత్త ట్రైబ్యునల్‌ వచ్చిన తర్వాత దాని ప్రకారం నడుచుకుందామని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సూచించారు. ‘‘తెలంగాణలో కాళేశ్వరం కట్టుకున్నప్పుడు నేను అడ్డుచెప్పలేదు. పైనుండేవారు నీటిని వాడుకుంటే నష్టమా లేక కింద ఉండేవారు నీటిని వాడుకుంటే నష్టమా? మీరు నీరు వాడుకోకపోతేనే కదా ఆ నీరు కిందకు వచ్చి సముద్రంలో కలిసేది. దాన్నే మేం వాడుకుంటామని చెబుతున్నా. తెలంగాణ కానీ ఆంధ్రా కానీ అంతా తెలుగువారే ఎందుకు మనకు మనం సమస్యలు సృష్టించుకుంటున్నాం. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకుందాం. చట్టబద్ధత కావాలంటే కేంద్రం వద్ద కూర్చుని చేసుకుందాం.’’ అని సూచించారు.


తెలంగాణపై నేను గొడవ పడ్డానా?

‘‘తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? మనం గొడవ పడటం అంటే ప్రజలను మభ్యపెట్టడమే! దానివల్ల రెండు రాష్ట్రాల ప్రజలకూ లాభం లేదు. పోరాటాలు అవసరం లేదు. కట్టే ప్రాజెక్టులన్నీ కట్టి నీళ్లు తీసుకోమనే తెలంగాణ వారికి చెబుతున్నాం. మిగిలినదే మేం వాడుకుంటాం. మనం మనం తిట్టుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3వేల టీఎంసీల నీరు ప్రతియేటా సముద్రంలో కలుస్తోంది. తెలంగాణ ఎంత వాడుకున్నా 100 టీఎంసీలు వాడుకుంటుంది.. మనం ఎంత వాడుకున్నా మరో 100 టీఎంసీలు వాడుకోగలం. దీనిపై రాద్ధాంతం ఎందుకు? ఏపీ, తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉండాలన్నదే నా ఆశయం.. అందరం కలిసి తెలుగుజాతిని ప్రపంచమే హద్దుగా అభివృద్ధి పథంలో నడిపిద్దాం. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ కట్టినా.. ఇక్కడ అమరావతి కడుతున్నా నా కోసం కడుతున్నానా? భవిష్యత్తు తరాల కోసం కడుతున్నాం. తెలంగాణ ఎకో సిస్టమ్‌ చాలా మంచిది. దాన్ని ఇక్కడ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి.’’

చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టింది నేనే..

‘‘గోదావరి నీళ్లను ఇరు రాష్ర్టాలు వాడుతున్నాయి. పోలవరం తప్ప మిగతావి అనుమతి రాని ప్రాజెక్టులే. విభజన చట్టంలో భాగంగా పోలవరం నిర్మాణం జరుగుతోంది. గోదావరి ప్రవాహంలో చిట్టచివరి రాష్ట్రంగా....వచ్చిన నీటిని వచ్చినట్టు మరో బేసిన్‌కు తరలిస్తున్నాం. గతంలో కృష్ణా బ్యారేజ్‌పై ఇరు రాష్ర్టాల సిబ్బంది గొడవ పడ్డారు. గవర్నర్‌ వద్ద కూర్చొని పరిష్కరించుకున్నాం. కృష్ణాలో తక్కువగా ఉన్న నీటిపై గొడవపడితే లాభం లేదు. ఉమ్మడి ఏపీలో నేనే చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టాను. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులుమొదలు పెట్టాను. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై వివాదం వేస్త అసెంబ్లీలో పోరాడాం.’’

Updated Date - Jun 20 , 2025 | 03:46 AM