Central Government: మరో రెండు రోజుల్లో ఉపాధి వేతనాలు!
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:00 AM
ఉపాధిహామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేతన బకాయిలను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది.

జనవరి నెలాఖరు నుంచి చెల్లించాల్సినవి విడుదల
వారంలో మెటీరియల్ నిధులూ చెల్లింపు
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేతన బకాయిలను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నుంచి చేపట్టిన పనులకు వేతనాలను చెల్లించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ ఢిల్లీ వెళ్లి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో కేంద్రం స్పందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వేతన బకాయిలు లేకుండా చెల్లింపులు సాఫీగా సాగాయి. అయితే కేంద్ర బడ్జెట్ రూపకల్పన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో జనవరి నెలాఖరు నుంచి ఉపాధి కూలీలకు చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ఇప్పుడు వేతనాల విడుదలకు మార్గం సుగమమైంది.
మరో రెండు రోజుల్లో కూలీలందరికీ వేతనాలు ఖాతాల్లో జమ అవుతాయని కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. మరో వారం రోజుల్లో ఉపాధి మెటీరియల్ బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైన వెంటనే మెటీరియల్ నిధులు కూడా వెండర్స్ ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు.