Share News

FDC Drugs Ban: 35 ఎఫ్‌డీసీ మందులకు సీడీఎస్‌సీవో అనుమతి లేదు

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:05 AM

సీడీఎస్‌సీవో అనుమతి లేకుండా మార్కెట్లోకి వచ్చిన 35 రకాల ఎఫ్‌డీసీ మందులపై డీసీజీ ఆదేశాలు జారీ చేశాడు. ప్రజారోగ్యానికి ప్రమాదకరమైన ఈ మందులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు లేఖ పంపించారు

FDC Drugs Ban: 35 ఎఫ్‌డీసీ మందులకు సీడీఎస్‌సీవో అనుమతి లేదు

  • ఆ కొత్త మందులతో ప్రజారోగ్యానికి ప్రమాదం

  • తక్షణమే చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు డీసీజీ లేఖ

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): డ్రగ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ అనుమతులు లేని 35 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) మందుల ఉత్పిత్తి, అమ్మకాలు, పంపిణీ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌(డీసీజీ) సూచించారు. ఈమేరకు డీసీజీ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్స్‌ కంట్రోలర్లకు లేఖ రాశారు. ‘ఇప్పటికే మార్కెట్లో వివిధ రకాల ఎఫ్‌డీసీ మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించినపుడు సక్రమమైన అనుమతులు పొందకుండానే కొన్ని ఎఫ్‌డీసీ మందులను తయారు చేసి, పంపిణీ చేస్తూ అమ్ముతున్నారని గ్రహించాం. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత డ్రగ్‌ కంట్రోలర్లు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీవో) అనుమతి తీసుకోకుండా మార్కెట్‌లోకి వచ్చిన ఎఫ్‌డీసీ మందులు నిబంధనల ప్రకారం ‘కొత్త మందు’ కిందకు వస్తుంది. సక్రమ నిర్ధారణ లేకుండా కొత్త మందులు మార్కెట్లోకి వస్తే ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది. కనుక చట్ట నిబంధనలను అనుసరించి మందుల తయారీకి లైసెన్సులు మంజూరు చేయాలని కోరుతున్నాం. సీడీఎస్‌సీవో అనుమతి లేకుండా ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 35 రకాల ఎఫ్‌డీసీ మందుల జాబితా ఇస్తున్నాం. అధికారులు తగు చర్యలు వెంటనే తీసుకోవాలి. డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్‌ యాక్ట్‌ 1940 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని రాజీవ్‌సింగ్‌ రఘువంశీ పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 03:06 AM