Share News

Land Re-Survey: రీ సర్వే అప్పీళ్లు పరిష్కరించకుంటే సస్పెండ్‌ చేస్తా

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:52 AM

రీ సర్వేలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా సొంత పనులపై దృష్టిపెడుతున్న వారిని సస్పెండ్‌ చేస్తానంటూ హెచ్చరించారు.

Land Re-Survey: రీ సర్వే అప్పీళ్లు పరిష్కరించకుంటే సస్పెండ్‌ చేస్తా

పనితీరు మారకుంటే ఉపేక్షించేది లేదు

పనిచేయనివారికి సర్వీసులో రివర్షన్‌

ఆర్‌ఎస్‌ డీటీలకు సీసీఎల్‌ఏ హెచ్చరిక

భూముల రీ సర్వేలో అప్పీళ్లను పరిష్కరించే డిప్యూటీ తహసీల్దార్లపై భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ సర్వేలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా సొంత పనులపై దృష్టిపెడుతున్న వారిని సస్పెండ్‌ చేస్తానంటూ హెచ్చరించారు. అప్పీళ్లు వినడానికే మండలానికి డీటీ పోస్టులు ఇచ్చారని, అలాంటిది ప్రభుత్వం అప్పగించిన పనిచేయకపోతే సర్వీసులో రివర్షన్‌ ఇస్తామన్నారు. రీ సర్వే అప్పీళ్ల డీటీలతో రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా బుధవారం నాగార్జున యూనివర్సిటీలో సమావేశం నిర్వహించాయి. అదనపు సీసీఎల్‌ఏ, సర్వే డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీసీఎల్‌ఏ జయలక్ష్మి మాట్లాడారు. నాడు జగన్‌ ప్రభుత్వంలో తప్పుల తడకగా సాగిన భూముల రీ సర్వే, రైతులు పడుతున్న కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ‘జగన్‌ చేసిన భూ గాయాలు’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీఎల్‌ఏ తీవ్రంగా స్పందించారు. ‘కోర్టుల్లో వివాదాలున్న కేసులను ఒకట్రెండు రోజుల్లో పరిష్కరిస్తున్నారు. రీ సర్వేలో అధికారుల వైఫల్యం వల్ల వచ్చిన తప్పులను సరిదిద్దడానికి సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటున్నారు.


ఇదెక్కడి న్యాయం? మీ పనితీరు ఇలాగే ఉంటే ఇకపై ఉపేక్షించేది లేదు. అప్పీళ్లు తీసుకోకున్నా, రైతుల కేసులను పరిష్కరించకున్నా సస్పెండ్‌ చేస్తాం. సర్వీసులో రివర్షన్‌ ఇస్తాం. ఇక మళ్లీ పదోన్నతులు రావు. మీరు ఏమనుకుంటున్నారో? రైతుల సమస్యల కన్నా మీకు మీ సొంత పనులే ముఖ్యమయ్యాయా? మీ వైఫల్యం వల్ల రైతులకు లెక్కలేనన్ని సమస్యలు వచ్చాయి’ అని ఆమె మందలించినట్లు తెలిసింది. రీ సర్వే గ్రామాల్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభల్లో 2.80 లక్షల విన్నపాలు వచ్చాయి. అందులో సింహభాగం అప్పీళ్ల డీటీలు తమ సమస్యలను పరిష్కరించలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. రీ సర్వేలో వచ్చే తప్పులను సర్వేయర్లు సరిదిద్దాలి. లేదంటే మండల స్థాయిలో రీ సర్వే అప్పీళ్ల డీటీ వద్ద పిటిషన్‌ ఇవ్వాలి. దాన్ని డీటీ పరిశీలించి సమస్య పరిష్కారానికి తగిన ఆదేశం ఇవ్వాలి. అయితే జగన్‌ ప్రభుత్వంలో అప్పీళ్ల డీటీ వ్యవస్థ పేరుకే పరిమితమైందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపఽథ్యంలో రైతుల రీ సర్వే ఇబ్బందుల పరిష్కారం కోసం డీటీల సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చే శారు. అప్పీళ్లు, రైతుల విన్నపాలను పరిష్కరించడంలో డీటీల పనితీరు బాగోలేదని సర్వే డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై వారం వారం నివేదికలు కోరుతామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 03:52 AM