Share News

CBI Director: వారంలో తిరుపతికి సీబీఐ చీఫ్‌!

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:02 AM

తిరుపతిలోని సిట్‌ అధికారులతో బుధవారం సీబీఐ చీఫ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు పురోగతిపై ఆరా తీశారు. ఈ సమీక్ష సందర్భంగా...

CBI Director: వారంలో తిరుపతికి సీబీఐ చీఫ్‌!

టీటీడీ పూర్వ పాలకవర్గాన్ని ప్రశ్నించే వీలు.. నాటి కీలక అధికారులపైనా విచారణ

అంత తక్కువకు నెయ్యి ఎలా కొన్నారు?.. అందులో నాణ్యత ఎలా సాధ్యం?

కమీషన్లు, పర్సెంటేజీలకు ఆశ పడ్డారా?.. నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగారా?

లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సిట్‌.. నెయ్యి పరిమాణంలోనూ తేడాలు

తిరుపతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ వారం రోజుల్లో తిరుపతికి వచ్చే అవకాశాలున్నాయి. తిరుపతిలోని సిట్‌ అధికారులతో బుధవారం సీబీఐ చీఫ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు పురోగతిపై ఆరా తీశారు. ఈ సమీక్ష సందర్భంగా... ఏఆర్‌ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ మునుపటి ముఖ్యులను ప్రశ్నించే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. సీబీఐ డైరెక్టర్‌ తాజా సమీక్ష, కొద్ది రోజుల్లో ఆయనే స్వయంగా తిరుపతికి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. టీటీడీకి సంబంధించిన మునుపటి కీలక అధికారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరణకు సంబంధించిన టెండరు నిబంధనలను ఎందుకు సడలించాల్సి వచ్చింది? తక్కువ ధరకు కోట్‌ చేసిన నెయ్యిని ఎలా కొనుగోలు చేశారు? బహిరంగ మార్కెట్‌లో నెయ్యి ధర ఎక్కువ ఉండగా తక్కువకు సరఫరా చేయడం ఎలా సాధ్యం? తక్కువకు సరఫరా అంటే నాణ్యతలో రాజీ పడినట్టే కదా? అన్న అంశాలపై ప్రశ్నించాలని సిట్‌ భావిస్తున్నట్టు సమాచారం.


కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యి నాణ్యమైనదిగా ఉండాలని, అలాంటప్పుడు తక్కువ ధరకు సరఫరా చేసే నెయ్యి నాణ్యంగా ఉంటుందని అప్పటి టీటీడీ బాధ్యులు ఎలా భావించారు? దీనిపై ఎలా నిర్ణయాలు తీసుకున్నారనే ప్రశ్నలు సిట్‌ అధికారులను వేధిస్తున్నాయి. దీని వెనుక పర్సెంటేజీలు, కమీషన్లు వంటి ఆర్థిక లబ్ధి గానీ లేదంటే అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనైనా గానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండాలని సిట్‌ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ సందేహాల నివృత్తి కోసమూ, ఇప్పటికే అరెస్టయిన డెయిరీల ప్రతినిధులు తమకు తాముగానే ఈ వ్యవహారం నడిపారా లేక తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది తేల్చుకునేందుకు సిట్‌ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ముందుగా టీటీడీలోని అప్పటి కీలక అధికారిని, ఆపై పాలకమండలి ముఖ్యులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సిట్‌ అధికారుల దర్యాప్తులో కొత్తగా మరో అంశం వెలుగు చూసినట్టు సమాచారం. ఏఆర్‌ డెయిరీ నుంచి టీటీడీకి సరఫరా చేసిన ఎనిమిది ట్యాంకర్లలో నాలుగింటిని అనుమతించి, మిగిలిన నాలుగింటిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి పరిమాణంలో కూడా తేడాలున్నట్టు సిట్‌ గుర్తించింది. ట్యాంకరుకు కనీసం 2వేల నుంచి 3వేల కిలోల చొప్పున తేడా ఉన్నట్టు సమాచారం. టీటీడీకి అందజేసిన ట్రిప్‌ షీట్లలో ఎక్కువ పరిమాణం నమోదు చేశారని, అదే డెయిరీలోని లాగ్‌ షీట్లలో తక్కువ పరిమాణం నమోదు చేశారని తెలిసింది.


కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న నలుగురు నిందితుల కస్టడీ కోసం సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తిరుపతి రెండో ఏడీఎం కోర్టులో విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న నేరారోపణతో ఏఆర్‌, వైష్ణవి, భోలేబాబా డెయిరీలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులను సిట్‌ గత ఆదివారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రి స్థానిక రెండో ఏడీఎం కోర్టు నిందితులు నలుగురికీ 11 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు. మరుసటి రోజు సోమవారం సిట్‌ అధికారులు నిందితులు రాజశేఖరన్‌, పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై రెండో ఏడీఎం కోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:02 AM