CBI Court: యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:54 AM
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు...
జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సీబీఐ కోర్టు అనుమతి
వచ్చే నెల 1-30 తేదీల మధ్య 15 రోజుల పర్యటన
నవంబరు 14లోపు కోర్టులో హాజరుకు ఆదేశం
సీబీఐ అభ్యంతరాలతో షరతులు విధింపు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో... పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొనగా... సీబీఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. ‘‘జగన్ ఆర్థిక నేరాల్లో నిందితుడు. విదేశీ పర్యటనలకు ఆయనను అనుమతించకూడదు. పైగా... గతంలో విదేశీ పర్యటనలకు అనుమతించినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. అందువల్ల... దీనికి సంబంధించి తగిన షరతులు విధించాలి’’ అని కోర్టును కోరారు. దీంతో... న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతించింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే... యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబరు 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది.