Share News

Amaravati Women: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సజ్జలపై కేసు

ABN , Publish Date - Jun 23 , 2025 | 06:31 AM

జగన్‌ టీవీ చానల్‌ డిబేట్‌లో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన చేపట్టిన రాజధాని అమరావతి మహిళలను సంకరజాతివారంటూ అవమానించిన వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

 Amaravati Women: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సజ్జలపై కేసు

  • తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదు

గుంటూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జగన్‌ టీవీ చానల్‌ డిబేట్‌లో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన చేపట్టిన రాజధాని అమరావతి మహిళలను సంకరజాతివారంటూ అవమానించిన వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమరావతి దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఆయనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సజ్జలపై బీఎన్‌ఎ్‌స సెక్షన్లు 79, 352, 353(2), 196(1) కింద కేసు నమోదు చేశారు. జగన్‌ టీవీ చానల్‌ డిబేట్‌లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ అనలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేయగా, యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు సమర్థించేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్‌ ేస్టషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.


ఏ1గా కృష్ణంరాజు, ఏ2గా యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏ3 గా సాక్షి యాజమాన్యాన్ని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ నెల 9న సజ్జల మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజధాని మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా పుండు మీద కారం చల్లినట్లు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ నిర్వహిస్తున్న చానల్‌పై కడుపు మంటతో నిరసన వ్యక్తం చేస్తున్నారని, వారంతా రాక్షసులు, పిశాచులు అని, ఆ రెండూ కలిసిన సంకరజాతి వారని, ఆ తెగకు చెందిన వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరని అవమానించేలా మాట్లాడారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్‌ కాక తప్పదని పోలీస్‌ వర్గాలు అంటున్నాయి. పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.

Updated Date - Jun 23 , 2025 | 06:31 AM