Case on Thopudurthi Over Helipad Chaos: తోపుదుర్తిపై కేసు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:06 AM
జగన్ పర్యటన సందర్భంగా రాప్తాడు మండలంలో భద్రతా లోపాలతో తోపులాట జరగగా, పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు

వైసీపీ శ్రేణులను
రెచ్చగొట్టి హెలిప్యాడ్ వద్దకు
అక్కడ పోలీసులతో దురుసు ప్రవర్తన
జగన్ పర్యటనలో గాయపడ్డ
కానిస్టేబుల్ ఫిర్యాదు
రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ధర్మవరం/రామగిరి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదైంది. గురువారం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పోలీసులు ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రాప్తాడు (అనంతపురం జిల్లా) నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా తోపులాట జరిగింది. వైసీపీ శ్రేణులు పోలీసులకు ఎదురు తిరిగి, వారిని తోసేసి హెలికాప్టర్ వద్దకు వెళ్లారు. ఆ తోపులాటలో పుట్టపర్తి రూరల్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నరేంద్రకుమార్ గాయపడ్డారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డితో పాటు మరికొందరిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌లు 186, 188, 341, 332, 352, 114, 506, 34 కింద కేసు నమోదు చేశామని ఏఎ్‌్‌సఐ ప్రసాద్ తెలిపారు.
హెలిప్యాడ్ వద్ద వైసీపీ కార్యకర్తలు తమ విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించడంతో గాయాలయ్యాయని కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. జగన్ పర్యటన లో చోటు చేసుకున్న సంఘటనలకు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే కారణమని పోలీసులు అంటున్నారు. హెలిప్యాడ్ నిర్వహణ బాగా లేదని డీఎస్పీ సహా పలువురు పోలీసులు చెప్పినా ప్రకాశ్ రెడ్డి పట్టించు కోలేదని అంటున్నారు. చిన్న ఊరు కావడంతో కార్యకర్తలను తరలించవద్దని ఎస్పీ రత్న చెప్పినా పెడచెవిన పెట్టారని, పైగా భద్రతా వైఫల్యం అంటూ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ చర్యలకు ఉపక్రమించారు.