Share News

AP High Court: భూదస్త్రాలను పెద్దిరెడ్డికి అందజేయండి

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:08 AM

తిరుపతి, ఎంఆర్‌ పల్లి పరిధిలోని సర్వే నెంబర్లు 261/1లోని 1.50 ఎకరాలు, 261/2లోని 2.38 ఎకరాలకు సంబంధించిన భూదస్త్రాలను వారం రోజుల్లో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయాలని తిరుపతి బుగ్గ మఠం అసిస్టెంట్‌ కమిషనర్‌/ఈవోను హైకోర్టు ఆదేశించింది.

AP High Court: భూదస్త్రాలను పెద్దిరెడ్డికి అందజేయండి

  • బుగ్గమఠం ఈవోకు హైకోర్టు ఆదేశం

  • ఈవోతో కాకుండా మరో అధికారితో విచారణ జరపండి.. అధికారులకు ధర్మాసనం నిర్దేశం

  • నాలుగు వారాల్లో నిర్ణయం వెల్లడించాలని స్పష్టీకరణ

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): తిరుపతి, ఎంఆర్‌ పల్లి పరిధిలోని సర్వే నెంబర్లు 261/1లోని 1.50 ఎకరాలు, 261/2లోని 2.38 ఎకరాలకు సంబంధించిన భూదస్త్రాలను వారం రోజుల్లో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయాలని తిరుపతి బుగ్గ మఠం అసిస్టెంట్‌ కమిషనర్‌/ఈవోను హైకోర్టు ఆదేశించింది. అధికారులు దస్త్రాలు అందజేసిన తర్వాత వివరణ ఇచ్చుకొనేందుకు పెద్దిరెడ్డికి వెసులుబాటు ఇచ్చింది. ఆ తరువాత పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల విషయంలో విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం వెల్లడించాలని అధికారులకు స్పష్టం చేసింది. బుగ్గమఠం ఈవోతో కాకుండా మరో అధికారితో విచారణ పక్రియ చేపట్టాలని నిర్దేశించింది. ట్రైబ్యునల్‌కు వెళ్లాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించారని నిర్ధారిస్తూ, వాటిని ఖాళీ చేయాలంటూ బుగ్గమఠం అసిస్టెంట్‌ కమిషనర్‌/ఈవో మే 16న ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ పెద్దిరెడ్డి మే 22న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దేవదాయ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని, అభ్యంతరాలన్నింటినీ ట్రైబ్యునల్‌ ముందు లేవనెత్తాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం ఎదుట పెద్దిరెడ్డి సవాల్‌ చేశారు. గురువారం ఆ పిటిషన్‌ విచారణకు వచ్చింది. పెద్దిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం, బుగ్గమఠం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దస్త్రాలను వారం రోజుల్లో పెద్దిరెడ్డికి అందజేయాలని బుగ్గమఠం ఈవోను ఆదేశించింది.

Updated Date - Jul 04 , 2025 | 03:09 AM