మురిపించి.. మెప్పించి
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:14 AM
కేంద్రంలో నిర్మలమ్మ బడ్జెట్ కాస్తంత ఆశాజనకంగా, కొంత నిరుత్సాహంగానే సాగింది. పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం సహజంగానే జనామోదం లభించింది.
నిర్మలమ్మ బడ్జెట్‌పై హర్షాతిరేకాలు.. విపక్షాల పెదవి విరుపులు
వినిపించని రైళ్ల కూత
వృద్ధులకు ఊరట మందులపై పన్ను మినహాయింపు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) (పాలకొల్లు/నరసాపురం/ఆకివీడు రూరల్–ఆంధ్రజ్యోతి)
కేంద్రంలో నిర్మలమ్మ బడ్జెట్ కాస్తంత ఆశాజనకంగా, కొంత నిరుత్సాహంగానే సాగింది. పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం సహజంగానే జనామోదం లభించింది. బడ్జెట్‌లో సాగు నీటి పథకాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిందో అదే వ్యవసాయం, ఆక్వా వంటి కీలక రంగాలకు అతి పెద్ద ప్రోత్సాహం దక్కలేదు. వేతన జీవులు, ఇతర వర్గాలు ఆశిస్తున్న దానికంటే రికార్డుస్థాయిలో ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం మరింత రంజింపచేసింది. రైల్వే కూతలేంటో ఇంకా బహిరంగం కాలేదు. నేడో, రేపో అవి కూడా అంకెల రూపంలో సాక్షాత్కరించబోతున్నాయి.
రైతన్నకు ఏదీ ఊరట ?
కేంద్ర బడ్జెట్‌లో రైతాంగానికి అతి పెద్ద ఊరట దక్కుతుందని అందరూ భావించారు. కాని దీనికి విరుద్దంగా కేవలం రెండు, మూడు రకాల పప్పు దినుసులను మాత్రం ప్రోత్సహించడం, దిగుమతి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకించి కిసాన్ సమ్మన్ పథకం కింద రైతుకు ఊతమిచ్చే సాయాన్ని ఈసారి పెంచకుండా మొండి చెయ్యి చూపించారు. దీంతో వ్యవ సాయదారులకు ఈసారి అతి పెద్ద ఊరట దక్కకుండా పోయింది. ప్రత్యేకించి ఎరువులు, పురుగు మందుల విషయంలోను, కనీస మద్దతు ధరల విషయంలోను బడ్జెట్‌లో ప్రస్తా వన మరిచారు. ఆక్వా రంగంలో కేవలం శీతలీక రించిన చేప ముక్కలపై కస్టమ్స్ సుంకాన్ని 30 నుంచి ఐదు శాతానికి తగ్గించారు. ఇవి తప్ప ఎగుమతుల విషయంలోను, చేపల మేత, విద్యుత్ సబ్సిడీల్లోను బడ్జెట్‌లో ఊరట దక్కక పోవడంతో ఆక్వా రైతులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాలలో ఆక్వా సాగవు తున్నది. రైతుల పక్షాన కిసాన్ క్రెడిట్ కార్డులు పరిమితి రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరంపై కేంద్రం మరింత కనికరం చూపింది. చాన్నాళ్లుగా మూలనపడిన ఈ ప్రాజెక్టును గట్టెక్కించే దిశగా శరవేగంగా నిధులు కేటాయిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్‌లోను ఐదు వేల 936 కోట్ల రూపా యల పద్దు చూపించారు. గడిచిన ఐదేళ్లలో ఇంత మొత్తంలో కేటాయించడం దాదాపు ఇదే ప్రఽథమం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా దీనికి కేంద్రం ఊతమిస్తూ వస్తోంది. ఈ మధ్యనే గ్రాంటురూపంలో రూ.12,157 కోట్లు కేంద్రం ప్రకటించగా, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోను భారీ కేటాయింపులపై హర్షం వ్యక్తమవుతోంది.
ఇక పోలవరం పూర్తి కావడానికి ఆటంకాలు లేవనే పరిస్థితి స్పష్టమవుతోంది.
ఆదాయపన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట
కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కలిగించారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిధి ఏకంగా రూ.12లక్షలకు పెంచారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 60వేల మంది వేతన జీవులకు ఊరట లభించింది. గతంలోఉన్న స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు పరిధిని, 75వేలుకు పెంచారు. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇది భారీ రాయితీగానే చెప్పవచ్చు. అయితే రూ.12 లక్షలపైబడి రూ.1రూపాయి ఆదాయం పొందినా పాత శ్లాబులు వర్తిస్తాయి. పాత విధానంలో రూ. 4 లక్షలకు పన్ను జీరోగా ఉంది. ఆపైన 8లక్షల ఆదాయానికి 5శాతం, రూ. 8 నుంచి 12లక్షల వరకు 10శాతం పన్ను గతంలో చెల్లిస్తున్నారు. నూతన విధానంలోనూ రూ. 12లక్షలు ఆదాయం మించితే మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా పాత పన్నువిధానం ఇంకా పూర్తిగా ముగియ లేదు. 2024 – 25 ఆర్థిక సంవత్స రానికి పాత విధానంలోనే పన్నుచెల్లించాల్సి ఉంటుంది
కాస్తో కూస్తో ఊరట
కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే 36 రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ వ్యాధులకు సంబంధించి రోగులకు మందుల కొనుగోలులో కాస్తంత ఊరటే. మొబైల్ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపి స్తున్నాయి. వృద్ధులకు వడ్డీపై టీడీఎస్‌ను కాస్త తగ్గించారు. ఇంటరాక్ట్ ప్లాట్ ప్యానల్ డిసిప్లే సుంకాన్ని 10 నుంచి 20 శాతం పెంచారు.
పిల్లలతో ప్రయోగాలే ప్రయోగాలు..
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఉన్నాయి. పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు పలు రకాల కొత్త తరహా ప్రయోగాలు ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం ఏటా వీటిని మంజూరు చేస్తోంది. ఒక్కో దానికి రూ.20 లక్షల వరకు వెచ్చిస్తోంది. 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
చిన్న వాటికి ఊతం..
బడ్జెట్‌లో చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పెట్టుబడి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న పారిశ్రామికవేత్తలకు మేలు జరగనుంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో వేలాది చిన్నతరహా పరిశ్రమలున్నాయి. బయట నుంచి అప్పులు తెచ్చి నష్టపోతున్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన రుణ పెంపు ప్రకటన అనేక మందికి మేలు చేయనుంది. అటు స్టార్టప్‌లకు రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు.
వృద్ధులకు వరాలు
వృద్ధుల ఆదాయంపై ఇన్నాళ్లు పన్నుల పేరిట జేబులు గుల్ల చేసిన కేంద్రం.. ఈ సారి వారు అర్జించే బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై పన్ను మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది.
ఇంటి అద్దెలపై అనేక మంది వృద్ధులైన ప్రభుత్వ, ప్రైవేటు రిటైర్డ్ ఉద్యోగులు జీవిస్తున్నారు. వీరికి అద్దెపై వచ్చే వార్షికాదాయం రూ.2.40 లక్షలు దాటితే చెల్లించాల్సిన పన్నును మినహాయించి రూ.6 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయాలు ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి మేలు చేకూర్చనున్నాయి.
పసిడిపై నో ట్యాక్స్
పసిడిపై ఎలాంటి పన్ను విధించకపోవడంతో బులియన్ వ్యాపారులు, వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బంగారం దిగుమతులపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ, మూడు శాతం జీఎస్టీ ఉంది. దేశంలో రోజు రోజుకు బంగారం దిగుమతులు పెరిగిపోవ డంతో దీన్ని తగ్గించేందుకు పన్ను పెంచుతా రని భావించారు. వీటి జోలికి వెళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
స్టాక్ మార్కెట్‌లో మిశ్రమ స్పందన
స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ మిశ్రమ స్పందన చూపించింది. షార్ట్ టర్మ్, లాంగ్ టార్మ్ గెయిన్స్‌పై మళ్లీ పన్ను పెంచుతారని మదుపు దారులు అంచనా వేశారు. వాటి జోలికి వెళ్లకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని మదుపు దారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచడం మార్కెట్‌కు ప్లస్ అయింది. ఊహించినట్లు పబ్లిక్ సెక్టార్‌కు ఎలాంటి కేటాయింపులు, రాయితీలు ఇవ్వలేదు. రైల్వే ఊసే లేదు. దీంతో ఈ రంగాల షేర్లు భారీగా పతనం కావడంతో మదుపుదారులు భారీగా నష్టాలను మూటకట్టుకున్నారు.